
- దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో చెప్పండి
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ పేలుడుతో జరిగిన ప్రాణనష్టం, బాధితులకు అందించిన పరిహారం, దర్యాప్తు తీరు తెన్నులపై పూర్తి వివరాలతో కౌంటర్దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని సిగాచి కర్మాగారంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదని, ఫ్యాక్టరీలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని, ప్రమాదం జరిగాక బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులోనూ ఆలస్యం చేస్తున్నారని రిటైర్డ్ సైంటిస్ట్ కే.బాబురావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిల్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే.సింగ్, న్యాయమూర్తి జస్టిస్ మొహియుద్దీన్ గౌస్ తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. కార్మికులంతా శాశ్వత ఉద్యోగులు కారని, వీరిలో ఎక్కువగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వలస కార్మికులే ఉన్నారని పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదించారు. పర్మినెంట్, కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా కార్మికులందరికీ పరిహారం చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు.
స్పందించిన హైకోర్టు.. ఎఫ్ఐఆర్ నమోదు సహా కేసు దర్యాప్తులో పురోగతిపై ఆరా తీసింది. ఇప్పటివరకు ఎవరినైనా అరెస్టు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, ఎవరినీ అరెస్టు చేయలేదని హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది సమాధానమిచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో ఎంతమంది పర్మినెంట్, ఎంతమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? వారి వివరాలు, కంపెనీ నుంచి ఎవరిని బాధ్యులుగా చేశారు? వారిపై కేసులు నమోదు చేశారా? బాధిత కుటుంబాల్లో ఎంతమందికి? ఎంత చొప్పున సాయం అందించారు? పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
కాగా, ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ, నిపుణుల కమిటీ నివేదికల కోసం తాము ఎదురుచూస్తున్నట్లు రాష్ట్రం తరఫున వాదించిన అడ్వకేట్లు చెప్పారు. దీంతో ఈ రెండు కమిటీల ఫలితాలపై దర్యాప్తు ఆధారపడి ఉంటుందా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఆ కమిటీ నివేదికలపై ఆధారపడి దర్యాప్తు ఉండబోదని రాష్ట్రం తరఫున న్యాయవాదులు చెప్పారు.
స్పందించిన హైకోర్టు.. దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన వ్యాజ్యంగా భావించవద్దని స్పష్టంచేసింది. మరణించిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయడానికి రాష్ట్రం తన వంతు కృషి చేయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.