మైల్ స్టోన్.. 50 కోట్ల మార్కు దాటిన జన్ ధన్ ఖాతాలు

మైల్ స్టోన్.. 50 కోట్ల మార్కు దాటిన జన్ ధన్ ఖాతాలు

జన్‌ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కును దాటిన ఘనతను కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. దీన్నొక మైలురాయిగా అభివర్ణించిన ఆయన.. ఈ ఖాతాల్లో సగానికి పైగా మహిళలదే కావడం హర్షణీయమని అన్నారు.  దేశంలో మొత్తం జన్‌ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్కును దాటిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆగస్టు 18న ప్రకటించింది. అందులో 56 శాతం మంది మహిళలేనని వెల్లడించింది.

జన్‌ధన్ ఖాతాల్లో దాదాపు 67 శాతం ఖాతాలు గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్నట్టు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన మోదీ.. ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని.. ఈ ఖాతాలలో సగానికి పైగా మా నారీ శక్తికి చెందినవి కావడం సంతోషదాయకంగా ఉందని చెప్పారు. 67% ఖాతాలు గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతానికి చెందినవని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ దీని ద్వారా ఆర్థిక ప్రయోజనాలను పొందేలా చేస్తామని హామీ ఇస్తున్నామని మోదీ స్పష్టం చేశారు.

జన్ ధన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ. 2.03 లక్షల కోట్లకు పైగా ఉండగా, ఈ ఖాతాలతో దాదాపు 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా జారీ చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మోదీ ప్రభుత్వం 2014లో జన్ ధన్ బ్యాంకు ఖాతాలను తెరవడం కోసం భారీ స్థాయిలో దేశవ్యాప్త కసరత్తును ప్రారంభించింది.  పేదలకు ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్రం దీన్ని అమల్లోకి తెచ్చింది.