- నాంకానా మిస్సింగ్ ఘటనలో ఊహించని ట్విస్ట్
న్యూఢిల్లీ: గురు నానక్ దేవ్ 555వ జయంతి సందర్భంగా పాకిస్తాన్‌లోని నాంకానా సాహిబ్ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన ఇండియన్ సిక్కు మహిళ సరబ్జీత్ కౌర్ (52) మిస్సింగ్ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె ఇస్లాం మతంలోకి మారి, తన పేరును నూర్‌గా చేంజ్ చేసుకుని పాకిస్తాన్ యువకుడిని పెండ్లి చేసుకున్నట్లు తేలింది. గురునానక్ దేవ్ జయంతిని పురస్కరించుకుని భారత్‌కు చెందిన 1,900 మందికి పైగా యాత్రికుల బృందం ఈ నెల 4న వాఘా-అట్టారి సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి ప్రవేశించింది.
ఈ బృందంలో పంజాబ్‌లోని కపుర్తలాకు చెందిన సిక్కు మహిళ సరబ్జీత్ కౌర్ కూడా ఉంది.13వ తేదీన ఈ బృందం మళ్లీ భారత్‌కు తిరిగి వచ్చింది. అయితే, అందులో సరబ్జీత్ కౌర్ కనిపించలేదు. ఆమె ఇమ్మిగ్రేషన్ ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ చేయలేదని పాకిస్తాన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు.
ఆమె మిస్సింగ్‌పై దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో సరబ్జీత్ కౌర్ లాహోర్ సమీపంలోని షేక్‌పురాకు చెందిన నాసిర్ హుస్సేన్‌ను పెండ్లాడినట్లు తేలింది. ఉర్దూలో ' నిఖానామా ' (ఇస్లామిక్ వివాహ ఒప్పందం) కూడా బయటపడింది. ఈ విషయాన్ని భారతీయ అధికారులకు పాకిస్తాన్ పోలీసులు తెలియజేశారు.
సరబ్జీత్ కౌర్ కు గతంలోనే కర్నైల్ సింగ్ అనే వ్యక్తితో పెండ్లి జరిగినట్లు గుర్తించారు. వారికి ఇద్దరు కొడుకులున్నారని తెలియజేశారు. ఈ దంపతులు విడాకులు తీసుకున్నారని.. కర్నైల్ సింగ్ దాదాపు 30 ఏండ్లుగా ఇంగ్లాండ్‌లో నివసిస్తున్నట్లు నిర్ధారించారు.
