అయోధ్య విరాళాల చోరీపై మీ మౌనం సరికాదు.. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ

అయోధ్య విరాళాల చోరీపై మీ మౌనం సరికాదు.. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ
  • చోరీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్ నేతలు
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కామెంట్
  • భక్తుల నమ్మకానికి ద్రోహం జరిగిందని ఆవేదన 
  • ట్రస్టు ఖాతాలను బహిరంగ పరచాలని డిమాండ్
  • ప్రధాని మోదీకి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఉమ్మడి లేఖ
  • చోరీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్ నేతలు
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌లో జరిగిన చందాల చోరీపై తక్షణమే స్వతంత్ర, సమగ్ర దర్యాప్తు జరిపించాలని పార్లమెంట్ ఉభయ సభల ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకం, భక్తి శ్రద్ధలతో తమ కష్టార్జితాన్ని రామమందిరం కోసం విరాళాలుగా ఇచ్చారని.. కానీ, ఈ విరాళాల దొంగతనంతో వారి నమ్మకానికి ద్రోహం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ప్రధాని నరేంద్ర మోదీకి  ఒక ఉమ్మడి లేఖ రాశారు. దీన్ని ఖర్గే ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 

ట్రస్ట్ నియామకాల్లో కేంద్రం పాత్ర

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ట్రస్ట్‌‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని పార్లమెంట్‌‌లో ప్రకటించినప్పటికీ, అందులోని సభ్యులందరినీ కేంద్ర ప్రభుత్వమే నియమించిందని ఖర్గే, రాహుల్ గుర్తు చేశారు. ఈ ట్రస్ట్‌‌లోని సభ్యులకు ఆర్‌‌ఎస్‌‌ఎస్, వీహెచ్‌‌పీలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. 

ముఖ్యంగా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవి కోల్పోయిన ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రధానికి అత్యంత సన్నిహితుడని ప్రతిపక్ష నేతలు ప్రస్తావించారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో జవాబుదారీతనం వహించాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని మండిపడ్డారు.

నిందితులను కఠినంగా శిక్షించాలి

భక్తులు కానుకలుగా సమర్పించిన నగదు, బంగారం, వెండి తదితర ఆర్థిక వ్యవహారాలన్నింటిపై వెంటనే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని ఖర్గే, రాహుల్ డిమాండ్ చేశారు. భక్తుల సొమ్మును ఎలా వినియోగించారో ప్రతి ఒక్కరికీ తెలిసేలా విచారణ నివేదికలను, ట్రస్ట్ ఖాతాలను వెంటనే బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. సమాజంలో ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా, ఎంతటి ప్రభావం ఉన్నవారైనా సరే.. ఈ అవినీతికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. 

ఈ విషయంలో తీసుకునే వేగవంతమైన, పారదర్శకమైన చర్యలపైనే ప్రభుత్వ విశ్వసనీయత ఆధారపడి ఉంటుందని, దేశ ప్రజలంతా ఈ పరిణామాలను గమనిస్తున్నారని ఖర్గే, రాహుల్ గాంధీ తమ లేఖలో ప్రధానిని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ మౌనాన్ని వీడాలని డిమాండ్ చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌‌లో చందాల చోరీపై ఉభయ సభల ప్రతిపక్ష నేతలు ప్రధానికి లేఖ రాయడం సముచితమన్నారు.