ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ దిగుమతుల బిల్లుపై వెండి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పెట్రోలియం ఉత్పత్తులు, గోల్డ్ దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతుంటాయి. కానీ ఈసారి వీటికి భిన్నంగా సిల్వర్ దిగుమతులు భారీగా పెరగడం గమనార్హం. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వెండి దిగుమతులు దాదాపు 129 శాతం పెరిగి 7.77 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో సిల్వర్ దిగుమతుల విలువ 3.39 బిలియన్ డాలర్లు మాత్రమే.
వెండి రేట్లు నిరంతరాయంగా పెరగడానికి ప్రధానంగా చైనా తీసుకున్న నిర్ణయాలే కారణం. ప్రపంచంలోనే వెండి ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో చైనాది అగ్రస్థానం. అయితే 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన కఠినమైన ఎగుమతి నిబంధనల వల్ల వెండి లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వెండిని ఒక 'సేఫ్ హెవెన్'గా మార్చాయి. పెట్టుబడిదారులు వెండిపై ఆసక్తి చూపడంతో జనవరి 15 నాటికి వెండి ధర ఔన్స్‌కు దాదాపు 91.6 డాలర్లకు చేరుకుంది.
మరోపక్క వెండి కేవలం నగలు, అలంకరణ వస్తువులకే పరిమితం కాలేదు. ఆధునిక పారిశ్రామిక అవసరాలకు వెండి ఇప్పుడు అత్యంత కీలక లోహంగా మారింది. సోలార్ ప్యానెళ్ల తయారీలో వెండి వాటా 2025 నాటికి 17 శాతానికి పెరిగింది. అలాగే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగంలో దాదాపు 25 శాతం వెండిని ఉపయోగిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెరగడంతో వెండికి డిమాండ్ మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారతదేశం తన వెండి అవసరాల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడుతోంది. 2025లో భారత వెండి దిగుమతుల్లో చైనా వాటా 40 శాతానికి పైగా ఉంది. అయితే చైనా ఆంక్షల నేపథ్యంలో.. సరఫరాలో ఇబ్బందులు కలగకుండా భారత్ ఇతర దేశాల వైపు చూస్తోంది. వెండి ఎక్కువగా ఉత్పత్తి చేసే పెరూ, చిలీ వంటి దేశాలతో 'ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్' కోసం చర్చలు జరుపుతోంది. దీనివల్ల కస్టమ్స్ సుంకాలు తగ్గి, తక్కువ రేటుకే వెండిని దిగుమతి చేసుకోవడంతో పాటు పారిశ్రామిక రంగానికి భరోసా లభిస్తుందని ఇండియా భావిస్తోంది. బంగారం దిగుమతులు తగ్గుతున్న వేళ, వెండి ఇటు పెట్టుబడిగా.. అటు పారిశ్రామిక వస్తువుగా తన ప్రాధాన్యతను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది.
