V6 News

సైబర్ నేరాల్లో సిమ్ కార్డ్ ఏజెంట్లు! కస్టమర్ల ఈ-కేవైసీ వివరాలతో పాయింట్ ఆఫ్ సేల్స్ నిర్వాహకుల దందా

సైబర్ నేరాల్లో సిమ్ కార్డ్ ఏజెంట్లు! కస్టమర్ల ఈ-కేవైసీ వివరాలతో పాయింట్ ఆఫ్ సేల్స్ నిర్వాహకుల దందా
  • కమీషన్ల కోసం సైబర్ నేరగాళ్లకు ప్రీ-యాక్టివేటెడ్ సిమ్‌‌ల విక్రయం
  • చంద్రాయణగుట్ట, నెల్లూరులో పట్టుబడ్డ ముఠాలు 

హైదరాబాద్‌‌, వెలుగు: సైబర్ నేరగాళ్ల చేతుల్లో సిమ్ కార్డులు డిజిటల్ దోపిడీకి ఆయుధాలుగా మారాయి. ఇండియా కంట్రీ కోడ్‌‌ నంబర్‌‌‌‌+91 సిరీస్‌‌తో కాల్స్ చేస్తూ.. సైబర్ నేరగాళ్లు అందినంతా దోచేస్తున్నారు. సైబర్ నేరాలతో లింకైన ఫోన్ నంబర్లు లభిస్తున్నప్పటికీ.. సైబర్ నేరగాళ్లు మాత్రం చిక్కడం లేదు. దీంతో స్పెషల్ ఆపరేషన్లకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో శ్రీకారం చుట్టింది. 

సైబర్ నేరాలతో లింకైన ఫోన్ నంబర్ల ఆధారంగా సెర్చ్ ఆపరేషన్లు చేస్తున్నది. ఈ క్రమంలో సిమ్ కార్డులు విక్రయించే ‘పాయింట్ ఆఫ్ సేల్‌‌’ సెంటర్లపై నిఘా పెట్టింది. ఈ నెల మొదటి వారంలో ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్‌‌ చేసి 600 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుంది. అందులో సైబర్ నేరాలతో లింకైన మరో 300 సిమ్ కార్డ్ నంబర్లను కూడా గుర్తించింది. ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ సహా ఆన్‌‌లైన్ అడ్డాగా సైబర్ నేరగాళ్లు వరుస మోసాలకు పాల్పడుతున్నారు. 

ఏటా దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా దోపిడీ చేస్తున్నారు. ఇలా కాంబోడియా, మయన్మార్‌‌‌‌లలో చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు కాల్‌‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వాటిలో ఇండియా కోడ్‌‌తో యాక్టివేట్‌‌ చేసిన సిమ్ కార్డులను వినియోగిస్తున్నారు. మ్యూల్‌‌ ఖాతాలు, సిమ్ కార్డుల కోసం దుబాయ్ కేంద్రంగా ప్రత్యేక సిండికేట్‌‌ పనిచేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ నెట్‌‌వర్క్‌‌లో దేశవ్యాప్తంగా ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు విస్తరించి ఉన్నారు.