
- అవకాశం వస్తుందా.. లేదా అని ఆశావహుల్లో ఉత్కంఠ
- ఎన్నికల సిబ్బంది శిక్షణకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బీసీలకు 42 శాతం, మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేలా జాబితాను సిద్ధం చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం పొలిటికల్ పార్టీలతో మీటింగ్‌లు, ఎన్నికల సిబ్బంది శిక్షణకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే నిర్వహణకు సిద్ధంగా ఉండేలా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించారు.
ఎన్నికలకు రెండు రకాల నివేదికలు..
జిల్లాలో 8,51,417 మంది ఓటర్లు ఉండగా, వారిలో మహిళలు 4,54,621, పురుషులు 3,96,778, ఇతరులు 18 మంది ఉన్నారు. ఈనెల 10న ఫైనల్ లిస్ట్ విడుదలైంది. జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు, 1,563 వార్డులు, 31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో సగం స్థానాలు మహిళలకు రిజర్వు కానున్నాయి.
డెడికేషన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఒకరి రిపోర్ట్‌ను ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బీసీ గణన ఆధారంగా మరో రిపోర్ట్‌ను జిల్లా అధికారులు తయారు చేశారు. ఈ రెండు రిపోర్ట్‌లలో ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేస్తే ఈ నెల 28న గెజిట్ రిలీజ్‌కి సిద్ధం కానుంది. మహిళా రిజర్వేషన్ స్థానాలు ఫైనల్ కానుండటంతో అధికారులు తుది చర్యలు చేపడుతున్నారు.
పోలింగ్ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ..
1,563 పోలింగ్ సెంటర్ల నిర్వహణకు ఆరు వేల మంది సిబ్బందిని ఎంపిక చేశారు. వీరికి రెండు రోజుల శిక్షణ ఇచ్చేందుకు జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఇందులో ఆర్వోలకు ఒక ఫేజ్, పీవో, ఏపీవో, స్టేజ్1, స్టేజ్2 ఆఫీసర్లకు శుక్ర, శనివారాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎలక్షన్ రెండు విడతల్లోనా, మూడు విడతల్లో నిర్వహిస్తారా అన్న క్లారిటీ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.