రెండేండ్లయినా ఫండ్స్ లేవు.. పవర్ లేదు.. పోరుబాట పడుతున్న ఎంపీటీసీలు

రెండేండ్లయినా ఫండ్స్ లేవు.. పవర్ లేదు.. పోరుబాట పడుతున్న ఎంపీటీసీలు

8 ఉమ్మడి జిల్లాల్లో చైతన్య సదస్సులు
రెండేళ్లుగా మండలాలకు పైసా ఇవ్వని సర్కారు

నిర్మల్‍, వెలుగు: ఫండ్స్​ లేవు.. పవరు లేదు.. కనీసం కూర్చునేందుకు పంచాయతీ ఆఫీసుల్లో కుర్చీ కూడా లేదు.. అలాంటప్పుడు మాకీ పదవెందుకు.. అని ఎంపీటీసీ మెంబర్లు సర్కారును నిలదీస్తున్నారు. నిధులన్నా ఇవ్వండి.. లేదా ఎంపీటీసీ సిస్టమ్​నైనా రద్దు చేయండంటూ పోరుబాట పట్టేందుకు రెడీ అయ్యారు. రెండు జిల్లాలు మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంగళవారం నాడు ఎంపీటీసీల చైతన్యసదస్సులు జరిగాయి.  తాము పుట్టిపెరిగిన ఊళ్లకు సేవ చేయాలన్న ఆశతో కష్టపడి.. ఖర్చు పెట్టుకుని గెలిస్తే ఏమీ చేయలేక పోతున్నామని  ఎంపీటీసీలు వాపోతున్నారు. మూడు నెలలకోసారి జరిగే మండల పరిషత్​ మీటింగ్​లకు అటెండ్​ కావడం తప్ప చేసేదేం ఉండడంలేదని, డెవలప్​మెంట్​ వర్క్స్​ కోసం నయాపైసా ఖర్చు చేయలేక పోతున్నామని బాధ పడుతున్నారు. ఎంపీపీల ఎన్నికప్పుడు, వాళ్ల మీద నో కాన్ఫిడెన్స్​ మోషన్​ పెట్టినప్పుడు తప్ప తమకు ఇంపార్టెన్స్​ ఉండడంలేదన్నది వారి ఆవేదన.

సర్కారుపై పోరాటమే..

తెలంగాణలో 535  మండల పరిషత్​లుండగా.. 5,857 మంది ఎంపీటీసీ మెంబర్లున్నారు. తమకు పవర్స్​, ఫండ్స్​ ఇవ్వకుండా సర్కారు  నిర్లక్ష్యం చేస్తోందని  ఎంపీటీసీలు మండిపడుతున్నారు.  మిగతా ప్రజాప్రతినిధుల లాగే ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినా తమకు రెస్పెక్ట్​ దక్కడంలేదని, డెవలప్​మెంట్​లో ఎక్కడా తమ ప్రమేయం ఉండడంలేదని ఆవేదన చెందుతున్న ఎంపీటీసీలు..  పార్టీలకు అతీతంగా సర్కారు మీద ఒత్తిడితెచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆందోళనలకు సంబంధించి క్యాలెండర్​ తయారు చేస్తున్నారు, ప్రభుత్వం తమ డిమాండ్లను ఒప్పుకునేదాక వివిధ రూపాల్లో  నిరసనలు, ఆందోళనలు చేస్తామని,   చలో అసెంబ్లీ   కార్యక్రమాన్ని చేపడతామని అంటున్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాతే ఫండ్స్​ కట్​

పంచాయతీ రాజ్‍వ్యవస్థలో కీ రోల్​ ప్లే చేయాల్సిన ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నారు.  మండల పరిషత్​లకు ఉమ్మడి రాష్ట్రంలో బీఆర్‍జీఎఫ్‍, స్టాంప్‍డ్యూటీ ఫండ్స్​ వచ్చేవి.  బీఆర్‌జీఎఫ్‌ నుంచి ఒక్కో ఎంపీటీసీ మెంబర్​ కనీసం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు డెవలప్​మెంట్​ వర్క్స్​ కోసం ఖర్చు చేయగలిగేవారు. ఒక్కోసారి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వచ్చేవి. తెలంగాణ పంచాయతీ రాజ్​ చట్టాన్ని సవరించిన తర్వాత మండలాలకు సినరేజ్​ ఫండ్స్​ఆగిపోయాయి. అంతకు ముందు మండలాల పరిధిలో జరిగే వర్క్స్​, మైనింగ్​ మీద వచ్చే సీనరేజ్​ చార్జీల్లో సగం మండల పరిషత్​లకు జమయ్యేవి. ఇప్పుడు ఆ ఫండ్స్​ మొత్తం కలెక్టర్లే కలెక్ట్​ చేసుకుంటున్నారు.   13వ ఫైనాన్స్ కమిషన్​ ద్వారా మండల పరిషత్‍లకు 20 శాతం ఫండ్స్​ వచ్చాయి. 14 ఫైనాన్స్​ కమిషన్ మొత్తం ఫండ్స్​ పంచాయతీలకే కేటాయించింది. పంచాయతీలకు 85 శాతం ఫండ్స్​ ఇచ్చిన 15 ఫైనాన్స్ కమిషన్​..   మండల పరిషత్‍లకు 10 శాతం, జడ్పీలకు 5 శాతం కేటాయించింది. మండల పరిషత్‍లకు ఫండ్స్​ పెంచాలని ఆందోళన చేయడంతో  స్టేట్​ గవర్నమెంట్​ కావాలంటే మండలాలకు 25 శాతం వరకు కేటాయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. కానీ స్టేట్​గవర్నమెంట్‍మాత్రం ఈ సిఫార్సులను పట్టించుకోలేదు. గత రెండేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం మండల పరిషత్​లకు అసలు ఫండ్స్​ ఇవ్వలేదు.

ఆత్మగౌరవం కోసం పోరాటం

ఎంపీటీసీల ఆత్మగౌరవ పోరాటంలో తొలిమెట్టుగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. ఎంపీటీసీలు ఎన్నికై ఏడాదిన్నర గడిచినా  ఒక్క రూపాయి ఇవ్వలేదు.  ఈ సదస్సుల ద్వారా మా డిమాండ్లను  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. స్పందించుకుంటే ఆందోళన చేపడతాం. ప్రజలు ఎన్నుకున్న ఎంపీటీసీలకు రాష్ట్రంలో గౌరవం లేకుండా పోయింది. ప్రజల కోసం ఏ పనిచేయలేకపోతున్నామన్న ఆవేదన ఉంది. కొన్ని మండల పరిషత్‍లు కరెంట్‍బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది. –చింపుల సత్యనారాయణ రెడ్డి, తెలంగాణ పంచాయతీ రాజ్‍చాంబర్​ స్టేట్​ ప్రెసిడెంట్

గెలిచినా ఉత్తదేనా..

ఎంపీటీసీలుగా గెలిచినందుకు ప్రజలకు ఏదైనా  చేస్తే బాగుంటుంది. అప్పుడే ప్రజల్లో మామీద  నమ్మకం పెరుగుతుంది. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాకుంటే ఊళ్లలో ఏం అభివృద్ధి చేస్తం. ఎంపీటీసీగా గెలిచిన పేరుకేగానీ మాకు ఎలాంటి అధికారం ఇయ్యరు. సర్పంచ్‍లకు ఇచ్చే గౌరవం కూడా మాకిస్తలేరు. –రాజవ్వ, ఎంపీటీసీ, గొల్లమడ