చాంగ్‌జౌ: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. చైనా ఓపెన్‌లో నిరాశపర్చింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–16, 20–22, 18–21తో వరల్డ్ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయ్ (చైనా) చేతిలో కంగుతిన్నది. గంటన్నర పాటు సాగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో 7–13తో వెనకబడినా తర్వాత పుంజుకుంది.
వరుస పాయింట్లతో 16–16తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మరో ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన చెన్ వరుస పాయింట్లతో హోరెత్తించింది. అయినా సింధుకు నాలుగు గేమ్ పాయింట్లు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 16–20తో వెనకబడిన చెన్ వరుసగా 22–20తో గేమ్‌ను ముగించింది.
డిసైడర్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగడంతో ఓ దశలో స్కోరు 17–17తో సమమైంది. ఇక్కడి నుంచి క్రాస్ కోర్టు విన్నర్లతో చెన్ వరుసగా పాయింట్లు గెలిచి గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
