
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ దేశ పాస్పోర్టుతో వీసా లేకుండా 195 దేశాలకు వెళ్లొచ్చని హెన్లీ అండ్ పార్టనర్స్ అనే సంస్థ వెల్లడించింది. వరల్డ్‌లో మోస్ట్ పవర్ఫుల్ పాస్‌పోర్టుల లిస్టును ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్’ పేరుతో ఆ సంస్థ బుధవారం విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా రిపోర్టును రూపొందించినట్టు తెలిపింది. ఇందులో మన దేశం 82వ స్థానంలో నిలిచింది. పోయినేడాది 84వ స్థానంలో ఉండగా, ఈసారి రెండు స్థానాలు మెరుగుపర్చుకుంది.
మన దేశ పాస్పోర్టుతో 58 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇండియాతో పాటు సెనెగల్, తజికిస్తాన్ కూడా 82వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ లిస్టులో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ రెండో స్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 192 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, స్వీడన్ మూడో స్థానంలో ఉండగా.. ఈ దేశాల పాస్‌పోర్టులతో 191 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంది. బ్రిటన్, న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్ నాలుగో స్థానంలో ఉండగా.. ఈ దేశాల పాస్ పోర్టులతో 190 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. 189 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీతో ఆస్ట్రేలియా, పోర్చుగల్ పాస్‌పోర్టులు ఐదో స్థానంలో ఉన్నాయి.
అమెరికా కిందికి..
అగ్రరాజ్యం అమెరికా స్థానం 8కి పడిపోయింది. ఈ దేశ పాస్పోర్టుతో 186 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లగలిగే అవకాశంతో పాకిస్తాన్ 100వ స్థానంలో నిలిచింది. ఇక లిస్టులో ఆఫ్గనిస్తాన్ అట్టడుగున ఉన్నది. ఆ దేశ పాస్పోర్టుతో కేవలం 26 దేశాలకు మాత్రమే వీసా లేకుండా వెళ్లొచ్చు.