సింగరేణి కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఒక్కో కార్మికుడికి బోనస్1.95 లక్షలు

సింగరేణి  కార్మికులకు లాభాల్లో 34 శాతం వాటా.. ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఒక్కో కార్మికుడికి బోనస్1.95 లక్షలు
  • దీపావళికి  కోల్‌‌‌‌ ఇండియా నుంచి వచ్చే బోనస్‌‌‌‌ పంపిణీ 
  • సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని మొదట కాకా చెప్పారు
  • ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్పగించాలి
  • ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తం
  • పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సింగరేణిని తీర్చిదిద్దుతం
  • జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో రాష్ట్రానికి ఏటా 7 వేల కోట్ల నష్టం
  • ఐదేండ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్​
  • ఒక్కో కార్మికుడికి బోనస్1.95లక్షలు
  • కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 చొప్పున చెల్లింపు

హైదరాబాద్, వెలుగు: సింగరేణి సాధించిన నికర లాభాల్లో కార్మికులకు 34శాతం వాటా బోనస్​ కింద  పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘‘2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,394 కోట్ల లాభాలు వచ్చాయి. ఇందులో సంస్థ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.4,034 కోట్లు తీసివేయగా,  రూ.2,360 కోట్ల నికర లాభాలు వచ్చాయి. ఇందులో 34 శాతం రూ.802 కోట్లు కార్మికులకు వాటా బోనస్​గా ప్రకటిస్తున్నాం’’ అని వెల్లడించారు.  అలాగే, గత ఏడాది నుంచి కాంట్రాక్ట్​ కార్మికులకు రూ. 5వేల చొప్పున బోనస్​ ఇవ్వడం ప్రారంభించామని, ఈసారి  దీనిని రూ. 5,500కు పెంచుతున్నామని ప్రకటించారు.  కోల్ ఇండియా నుంచి సింగరేణి సంస్థకు వచ్చే లాభాల్లోనూ కార్మికులకు దీపావళి బోనస్‌‌‌‌ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

లాభాల్లో వాటా బోనస్​ ప్రకటన సందర్భంగా  సెక్రటేరియెట్‌‌‌‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు  వివేక్ వెంకటస్వామి, శ్రీధర్‌‌‌‌‌‌‌‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి , పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డితో కలిసి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కార్మికులు పోషించిన పాత్రను సీఎం గుర్తు చేసుకున్నారు.  రాష్ట్ర, దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణి  కార్మికులకు సంస్థ సాధించే లాభాల్లో వాటాలు పంచా లని కాకా వెంకటస్వామి చెప్పారని సీఎం చెప్పారు. సింగరేణి నష్టాల్లో కూరుకుపోయి మూత పడే స్థితికి చేరినప్పుడు కేంద్రాన్ని కాకా సంప్రదించి.. ఆర్థిక సాయం అందేలా చేసి సంస్థను నిలబెట్టారని గుర్తుచేశారు. ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో పయనిస్తున్నదని పేర్కొన్నారు.

సింగరేణికి ప్రైవేట్​ గనులు దక్కేలా కృషి చేస్తా.. 
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని బొగ్గుగనుల వేలంలో పాల్గొనకుండా చేయడం వల్ల ప్రైవేటుకు కోల్పోయిన రెండు గనులను తిరిగి సంస్థ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ తెలిపా రు. ఇందుకోసం కేంద్రంతో సంప్రదిపులు జరుపుతామ ని చెప్పారు. ప్రైవేట్ టెండర్లను రద్దు చేసి, సింగరేణికి కేటాయించాలని కోరుతామని, లేదంటే టెండర్ కంటే ఎక్కువ చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు. సింగరేణి ప్రాంతంలో ప్రైవేట్ సంస్థల ప్రాతినిథ్యం పెరిగితే సంస్థ మనుగడకే ముప్పు ఏర్పడుతుందని అన్నారు.

సింగరేణి సంస్థను కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వడమే కాకుండా.. భవిష్యత్ ప్రణాళికతో సంస్థను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఇందుకోసం కార్మిక సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వంతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు, అలాగే, ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన క్రాస్ సబ్సిడీ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని, ఈ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తామని చెప్పారు. 

ఆ రెండు బ్లాక్​లు గత ప్రభుత్వ సన్నిహితులకే: డిప్యూటీ సీఎం భట్టి 
రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి సంస్థ ఆత్మలాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సంస్థను జాగ్ర త్తగా నడుపుతూ.. కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యాజమాన్యానికి అభినందనలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు. గత పదేండ్లు సింగరేణి సంస్థ కొత్త బ్లాక్‌‌‌‌‌‌‌‌ల వేలంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సింగరేణి సంస్థను వేలానికి దూరం పెట్టడం వల్ల రెండు బ్లాక్‌‌‌‌‌‌‌‌లు కోల్పోయిందని గుర్తు చేశా రు. ఆ రెండు బ్లాక్‌‌‌‌‌‌‌‌లు గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయని చెప్పారు.

సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెట్టాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందని భట్టి ఆరోపించారు. కీలక ఖనిజాల మైనింగ్‌‌‌‌‌‌‌‌లోకి సింగరేణి సంస్థ వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. ఈ సమావేశంలో  సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌రావు, ఎంపీలు పోరిక బలరాం నాయక్‌‌‌‌‌‌‌‌, రఘురామిరెడ్డి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సింగరేణి కాలరీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం తదితరులు పాల్గొన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో జరిగే నష్టాన్ని పూడ్చాలి
జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రం దాదాపు రూ.7 వేల కోట్ల దాకా ఆదాయం కోల్పోతున్నదని,  రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ అంశాన్ని లేవనెత్తారని గుర్తుచేశారు. మొదటి ఐదేండ్ల మాదిరిగానే భవిష్యత్తులోనూ ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నానని, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కేంద్రం పూడ్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

జీఎస్టీ రద్దు చేయడం వల్ల కోల్ ధరలు పడిపోవడం, దానివల్ల పవర్ జనరేషన్ కాస్ట్ తగ్గడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్న అడగ్గా.. ‘‘ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. సింగరేణిని పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా తీర్చిదిద్దుతాం” అని సమాధానమిచ్చారు.  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పోటీని తట్టుకుని ముందుకు సాగాలని, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.