- పోటీని తట్టుకోవడానికి బొగ్గు ధరలు తగ్గించాల్సి వస్తోంది
- సింగరేణి సీఎం బలరామ్ సూచన
- 10 రాష్ట్రాల్లో కంపెనీని విస్తరిస్తామని వెల్లడి
- సింగరేణి భవన్‌లో 39వ నిర్మాణాత్మక సమావేశం
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం పని సంస్కృతిని మెరుగుపరచడం తప్పనిసరని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అన్నారు. ఉద్యోగులు తమకు కేటాయించిన 8 గంటల పనివేళలను పూర్తిగా సంస్థ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. సోమవారం సింగరేణి భవన్‌లో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో 39వ నిర్మాణాత్మక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. బొగ్గు రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ధరలు తగ్గించాల్సి వచ్చిందన్నారు.
ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడమే కీలకమని, ప్రతి ఉద్యోగి పూర్తి సమయాన్ని కేటాయిస్తూ యంత్రాలను సమర్థంగా వినియోగించాలన్నారు. విధులకు గైర్హాజరు అవుతున్న కార్మికులు హాజరయ్యేలా యూనియన్ సహకరించాలని కోరారు. రానున్న రోజుల్లో దేశంలోని పది రాష్ట్రాల్లో సంస్థ కార్యకలాపాలు విస్తరిస్తామని తెలిపారు. 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ను, అంతర్జాతీయ స్థాయిలో ఖనిజ అన్వేషణ, మైనింగ్ కోసం సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కంపెనీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
సీఎండీకీ గుర్తింపు సంఘం ప్రశంసలు
సింగరేణిని అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దడంలో సీఎండీ తీసుకుంటున్న చొరవను గుర్తింపు కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశంసించారు. కార్మికులకు సొంత ఇంటి పథకం, కొత్తగూడెంలో క్యాథ్ ల్యాబ్, థర్మల్ ప్లాంట్ ఏర్పాటు
చేయాలని ఆయన కోరారు. ఇల్లందు ప్రాంతంలో కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.
ఉద్యోగుల సంక్షేమం, వసతుల విస్తరణ
ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి దేశంలోనే టాప్ సంస్థగా నిలిచిందని బలరామ్ పేర్కొన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో వెయ్యి క్వార్టర్ల నిర్మాణాన్ని గోదావరిఖని, మణుగూరు, భూపాలపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో చేపట్టామని తెలిపారు.
గోదావరిఖనిలో వచ్చే రెండు నెలల్లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అలాగే హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు ప్రణాళికలో ఉందన్నారు. ఉద్యోగుల పిల్లల విద్య కోసం రామగుండం–2 ఏరియాలో సీబీఎస్ఈ పాఠశాల ప్రారంభించామని, ఇతర ప్రాంతాల్లోనూ స్థాపించనున్నామని తెలిపారు.
