సింగరేణి బొగ్గు గనులు... ఇక టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు !

సింగరేణి బొగ్గు గనులు... ఇక టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లు !
  • ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ మైన్స్‌‌‌‌‌‌‌‌ వద్ద హోటళ్లు, రెస్టారెంట్ల ఏర్పాటుకు కసరత్తు
  • కొత్తగూడెం జీకే ఓసీపీని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం నిర్ణయం
  • పట్టణాలకు సమీపంలో ఉన్న గనుల అభివృద్ధికి చర్యలు
  • కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచనతో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న సీఎండీ

కోల్‌‌‌‌‌‌‌‌బెల్ట్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సింగరేణిలో మూసివేసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ బొగ్గు గనులను టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లుగా మార్చడంతో పాటు, సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించే మార్గాలపై యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది. కోల్‌‌‌‌‌‌‌‌మైన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి వచ్చే నీటిని వినియోగించుకుంటూ ఫ్లోటింగ్‌‌‌‌‌‌‌‌ హోటళ్లు, రెస్టారెంట్లు, చేపల పెంపకం, వనాల పరిరక్షణ వంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. ఇందుకోసం స్థానిక స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలని చెప్పారు. దీంతో వాటి సాధ్యాసాధ్యాలపై సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌ దృష్టి సారించారు.
 
ఓసీపీల్లో పర్యావరణంపై దృష్టి
సింగరేణిలో మూసివేసిన ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌లను తిరిగి వివిధ రకాలుగా వినియోగించుకునేలా యాజమాన్యం మొదటి నుంచి పక్కాప్లాన్‌‌‌‌‌‌‌‌తో వెళ్తోంది. జీవితకాలం పూర్తై ఖాళీగా ఉన్న గనులను పర్యావరణహితంగా మార్చేలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ఓసీపీల్లో సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుంది. భూసారాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో ఓసీపీల ప్రారంభం నుంచే మట్టి పైపొరల్ని సేకరించి వేరుగా భద్రపరుస్తోంది.

ఓసీపీ మైన్స్‌‌‌‌‌‌‌‌ నుంచి తీసిన మట్టిని పోసిన యార్డులపై భారీ సంఖ్యలో మొక్కలు నాటి చిన్నపాటి అడవిగా రూపొందించడంలో సింగరేణి దేశంలోనే నెంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోంది. ఓసీపీ, అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ మైన్ల నుంచి వెలికితీసే నీటిని సమీపంలోని చెరువులకు మళ్లిస్తూ పంటలకు సాగునీరుగా వినియోగిస్తున్నారు. మరోవైపు ఓసీపీల్లోని నీటి నిల్వలపై ఇప్పటికే వాటర్‌‌‌‌‌‌‌‌ ఫ్లోటింగ్‌‌‌‌‌‌‌‌ సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు ఏర్పాటు చేయగా, తాజాగా పంప్డ్​స్టోరేజ్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మించి జలవిద్యుత్‌‌‌‌‌‌‌‌ను ఉత్పత్తి చేయాలని  నిర్ణయించింది. ఇందుకోసం ఖమ్మం జిల్లా ఇల్లందులో వృథాగా ఉన్న గనిని ఎంపిక చేశారు. ఇక్కడ 100 మెగావాట్ల కెపాసిటీతో పంప్డ్‌‌‌‌‌‌‌‌ స్టోరేజీ పవర్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని నిర్ణయించారు.

మొదటగా కొత్తగూడెం జీకే ఓసీపీ..
కొత్తగూడెంలోని జీకే ఓసీపీని టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దేందుకు యాజమాన్యం నిర్ణయించింది. గని సమీపంలో పార్క్‌‌‌‌‌‌‌‌, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. సమీపంలోని చెరువును అభివృద్ధి చేయడంతో పాటు కేఫెటేరియా, బోటింగ్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేస్తోంది. ఇదే విధంగా ఇతర ఓసీపీలను సైతం టూరిస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సింగరేణి వ్యాప్తంగా 17 ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌మైన్లు ఉన్నాయి. మూతపడిన ఓసీపీలను పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రాలుగా మలుచుకునేందుకు వెసులుబాటు ఉంది. దీంతో పట్టణాలకు సమీపంలో ఉన్న ఓసీపీలపై ప్రధానంగా దృష్టి సారించారు.

బెల్లంపల్లి ఏరియా పరిధిలోని డోర్లి ప్రాంతంలో ఓపెన్‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌ గనులు ఉన్నాయి. మందమర్రి ఏరియాలోని ఆర్కేపీ ఓసీపీ విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడడంతో అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. బొగ్గు ఉత్పత్తి కొనసాగిస్తూనే భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం, శ్రీరాంపూర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాల్లోని ఓసీపీలను పర్యాటకంగా తీర్చిదిద్దితే స్థానికుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైపు ఓవర్​బర్డెన్​(మట్టి) డంపులపై ఇప్పటికే పచ్చదనాన్ని పెంచుతుండడంతో ఆ ఏరియాల్లో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. దీనికి తోటు బోటింగ్‌‌‌‌‌‌‌‌, వాటర్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ సైతం ప్రవేశపెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. 

చేపల పెంపకానికి అనుకూలం
మూసివేసిన ఓసీపీల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో చేపల పెంపకం చేపడితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. ఓసీపీలు వందల ఎకరాల్లో విస్తరించి ఉంటాయి. చెరువులు తవ్వాల్సిన అవసరం లేకుండానే ఓసీపీలను వినియోగించుకొని సమీప ప్రాంతాల ప్రజలు, భూనిర్వాసితులు ఆర్థికంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. భారీ నీటి నిల్వ ఉన్న చోట లక్నవరం సరస్సు తరహాలో వేలాడే వంతెన ఏర్పాటుచేస్తే సింగరేణి గనులు పర్యాటక ప్రాంతాలు మారే అవకాశం ఉంది. జేకే ఓసీపీతో పాటు మిగతా చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక అభివృద్ధి పనుల ఏర్పాట్ల సాధ్యసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి సీఎండీ బలరాంనాయక్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.