
- ఇన్‌టైంలో ఆర్డర్లు పెట్టట్లే
- శాఖల మధ్య సమన్వయ లోపం
- వారం, పది రోజులకు సరిపడా మందులే ఇస్తున్నరు
- రిటైర్డ్ కార్మికుల ఇబ్బందులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి హాస్పిటల్స్‌ను మందుల కొరత వెంటాడుతోంది. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న యాజమాన్యం అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. మందులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రిటైర్డ్కార్మికులకు నెల, రెండు నెలలకు సరిపడా ఇవ్వాల్సి ఉండగా వారం, పది రోజులకే ఇస్తున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు రాసిన డోసుల ప్రకారం కూడా ఇవ్వడం లేదంటున్నారు. అవసరమైన మందులను బల్క్‌గా ఆర్డర్పెట్టడంలో సింగరేణి వైద్యశాల, పర్చేజ్డిపార్ట్ మెంట్ల
మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ఏడాదికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు
కార్మికుల వైద్యానికి సింగరేణి యాజమాన్యం ఏటా రూ.350 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. మందుల కోసం దాదాపు రూ.35 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌తోపాటు ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మందమర్రి ప్రాంతాల్లో ఏరియా హాస్పిటల్స్, సింగరేణి వ్యాప్తంగా 21 డిస్పెన్సరీలు ఉన్నాయి. సింగరేణిలో 42 వేల మందికి పైగా పని చేస్తున్నారు.
40 వేల మందికి పైగా రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు వైద్య సేవలు పొందుతున్నారు. కొందరు రిటైర్డ్ కార్మికులు ఏరియా హాస్పిటల్స్ ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నారు. ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లోనూ ఉంటున్నారు. ఎక్కువ మంది రిటైర్డ్కార్మికులు బీపీ, షుగర్, శ్వాసకోశ వ్యాధులు, నొప్పులు, ఇతర వ్యాధులతో బాధ పడుతున్నారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇవ్వాలని వారు
కోరుతున్నారు.
ప్రపోజల్స్, ఒప్పందాల్లో తీవ్ర జాప్యం
ఏటా డిసెంబర్ లో ఏడాదికి అవసరమైన మందుల కోసం సింగరేణి వైద్యశాఖ ప్రతిపాదనలు రూపొందిస్తుంది. మందులను బల్క్‌గా సప్లై చేసేలా ఫార్మా కంపెనీలతో సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకుంటుంది. కానీ ప్రపోజల్స్పంపడం, ఫార్మా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో హాస్పిటల్స్ లో పూర్తిస్థాయిలో మందులు ఉండడం లేదు. ఫార్మసిస్టులు ఉన్న మందులతోనే సరిపెడుతున్నారు. మందుల కొరతతో డాక్టర్లు రాసినవి కాకుండా ఇతర మందులు ఇస్తున్నారని రిటైర్డ్ కార్మికులు చెబుతున్నారు. కొందరు ఫార్మాసిస్టులను డోసు, మందులపై ప్రశ్నిస్తే విసుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనుంచి ఇబ్బంది ఉండదు
నేను ఇటీవలే చీఫ్‌మెడికల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టాను. మందుల కొరత విషయం నా దృష్టికి వచ్చింది. గతంలో హాస్పిటల్స్ కు అవసరమైన మందులకు సంబంధించి ప్రపోజల్స్ పంపడం, పర్చేజ్ లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. ఇకనుంచి ఇబ్బంది ఉండదు. రిటైర్డ్కార్మికులకు నెల రోజులకు సరిపడా మందులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని రకాల మందులు వచ్చాయి. మిగతావి వస్తున్నాయి. - కిరణ్‌రాజ్ కుమార్, సీఎంవో, సింగరేణి మెయిన్హాస్పిటల్, కొత్తగూడెం