సింగరేణి కార్మికులకు పనిముట్లు సాల్తలేవ్!

సింగరేణి కార్మికులకు పనిముట్లు సాల్తలేవ్!
  •     సప్లయ్​పై దృష్టి పెట్టని యాజమాన్యం

కోల్​బెల్ట్, వెలుగు : సరిపడా పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం కార్మికులను వేధిస్తోంది. కంపెనీ నినాదమైన ‘రక్షణే ప్రథమం.. రక్షణే లక్ష్యం.. రక్షణే గమ్యం..’ను ఉన్నతాధికారులు గాలికొదిలేస్తున్నారు. గనుల్లో ఫస్ట్​ఎయిడ్​కిట్లు అందుబాటులో ఉంచడం లేదు. చేతులకు గాయాలు కాకుండా గ్లౌజ్​లు, కళ్లకు రక్షణగా కళ్ల జోళ్లు, చెడు గాలి ముక్కులోకి వెళ్లకుండా మాస్కులు సరఫరా చేయడం లేదు. బురద ప్రాంతంలో డ్యూటీలు చేసే కార్మికులకు గమ్​షూలు ఇవ్వడంలేదు. డ్రిల్ రాడ్లు క్వాలిటీ లేక మధ్యలోకి విరిగిపోవడంతో కార్మికులు ప్రమాదాల బారినపడుతున్నారు.

అండర్ గ్రౌండ్ మైన్లలో పనిచేసేవారికి బూట్లు, హెల్మెట్లు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. డ్రిల్ బిట్లు, డ్రిల్​రాడ్లతోపాటు చెమ్మస్, ఎస్డీఎల్, ఎల్​హెచ్​డీ మిషన్​విడిభాగాలను అందించడం లేదని చెబుతున్నారు. ఉన్నవాటితో సర్దుకుని పనిచేయాల్సి వస్తోందని వాపోతున్నారు. బొగ్గు నింపడానికి కనీసం పది మందికి ఒక తట్టా, చెమ్మస్​సమకూర్చడం లేదంటున్నారు.

క్వాలిటీ లేకనే ప్రమాదాలు

సింగరేణి ఆఫీసర్లు బొగ్గు టార్గెట్లు ఇస్తున్నారే తప్ప కార్మికులకు అవసరమైన పనిముట్లను అందించడం లేదు. అందుబాటులో ఉంచుతున్న వస్తువుల్లో క్వాలిటీ ఉండటం లేదు. పనిచేస్తున్న టైమ్​లో విరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. సరిపడా డ్రిల్ బిట్లు, డ్రిల్ రాడ్లు ఇవ్వడం లేదు. బూట్లు క్వాలిటీగా ఉండడం లేదు. యాజమాన్యం స్పందించి సరిపడా క్వాలిటీ పనిముట్లు ఇవ్వాలి.

- భీమనాథుని సుదర్శనం, ఏఐటీయూసీ లీడర్