సింగరేణి ఎగ్జామ్ లో నయాదందా : ఒకరికి బదులు ఇంకొకరు

సింగరేణి ఎగ్జామ్ లో నయాదందా : ఒకరికి బదులు ఇంకొకరు

భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, వెలుగు: పరీక్షలో ఏం రాసినా ఫుల్ మార్కులు వస్తే.. మనకు బదులుగా ఇంకొకరు వెళ్లి పరీక్ష రాస్తే… అలా ఎలా అని ఆశ్చర్యపోకండి. ఇలాంటి ప్రయత్నం చేసి ఓ ముఠా దొరికింది. సింగరేణిలో పలు ఉద్యోగాల భర్తీకి జరిగిన పరీక్షల్లో కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకున్న గ్యాంగ్ పట్టుబడింది. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో సింగరేణికి చెందిన ఓ ఎంప్లాయ్ కూడా ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడిని వాయిదా వేస్తున్నట్లు సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. అవసరమైతే పరీక్షనే రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

సంతకం తప్పుగా ఉండటంతో…

సింగరేణిలో ఖాళీగా ఉన్న 68 మేనేజ్​మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్) పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ విడుదలైంది. కోర్టు కేసులు, జోనల్ విధానంలో మార్పుల తర్వాత ఈనెల 1న పరీక్ష నిర్వహించింది. ఆదివారం ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచలోని 36 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 8,747 మంది హాజరయ్యారు. పాల్వంచలోని అనుబోస్ సెంటర్​లో పరీక్ష రాసే సమయంలో ఇన్విజిలేటర్ హాల్ టికెట్లను చెక్ చేస్తున్నారు. సంతకం తప్పుగా ఉండటంతో అనుమానం వచ్చి పరీక్ష రాసే అభ్యర్థి పేరు అడిగారు. పేరు కూడా తప్పుగా చెప్పటంతో అనుమానం వచ్చి అధికారులకు సమాచారం అందించారు. అతని బ్యాగ్​ను పరిశీలించగా మరో నాలుగు హాల్ టికెట్లు దొరికాయి. విచారణ జరిపిన సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు.. తర్వాత కొత్తగూడెం, పాల్వంచ, ఖమ్మం కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను అలర్ట్ చేశారు. ఒకరి పేరు మీద మరొకరు పరీక్ష రాస్తున్నట్టుగా గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కొత్తగూడెం హెడ్ ఆఫీస్ కేంద్రంగా..

కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్​ కేంద్రంగానే దందా సాగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆది, సోమవారాల్లో మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్​కు చెందిన వారిగా గుర్తించారు. పరీక్ష పేపర్లను హెడ్ ఆఫీసులోనే తయారు చేశారు. పేపర్ ఫైనల్​గా తయారు చేసే వ్యక్తితో కంపెనీలో పనిచేసే కొందరు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంత తక్కువ మార్కులు వచ్చినా ఫుల్ మార్కులు వేసేలా ఒప్పందం చేసుకున్నారని, డూప్లికేట్ హాల్ టికెట్లతో పరీక్ష రాసేలా మరో డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

16 మంది వచ్చిన్రు..

హైదరాబాద్​కు చెందిన గంగాధర్​ రెడ్డి అనే వ్యక్తితోపాటు మరికొందరు కలిసి ఢిల్లీలోని ముఠాతో మంతనాలు సాగించారు. డూప్లికెట్ హాల్ టికెట్లతో పరీక్ష రాసేందుకు మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీ నుంచి 16 మంది వచ్చారు. పరీక్ష హాల్​లోకి వెళ్లిన తర్వాత క్వశ్చన్ పేపర్​ను తమ వద్దనున్న పరికరాల సాయంతో ఐదు నిమిషాల్లోనే స్కాన్​ చేసి ఢిల్లీలోని స్నేహితులకు పంపిస్తారు. కొంత సేపటి తర్వాత అక్కడి నుంచి సమాధానం వచ్చేలా ప్లాన్​ చేశారు. పాల్వంచలో ఒక వ్యక్తి దొరకటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ, బీహార్, మహారాష్ట్రలకు చెందిన దీపక్​మోర్, రాందాస్, రాకేశ్​కుమార్, మంజిత్​లను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో ముగ్గురు కొత్తగూడేనికి చెందిన శుద్ధపల్లి సాయి కృష్ణ, ముఖేశ్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ స్థానంలో పరీక్షలకు హాజరయ్యారని, వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, ఇయర్ ఫోన్ లు, బ్లూ టూత్​లు, డూప్లికెట్ హాల్ టికెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.

ఓ ఉద్యోగి అరెస్టు..

సింగరేణిలో సేఫ్టీ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొత్తగూడెం పట్టణం రామవరానికి చెందిన ఈయన వద్ద నుంచి రూ.4 లక్షలు నగదుతోపాటు సంతకాలు చేసిన ఖాళీ చెక్​లను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మంలో పరీక్ష రాసేందుకు వచ్చిన మరికొందరు పరారీలో ఉన్నట్టుగా తెలిసింది. కోల్ ఇండియా పరీక్షల్లోనూ, ఎంసెట్ లీకేజీలోనూ వీరి పాత్ర ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.