- పర్యావరణానికి మేలంటున్న నిపుణులు
- దేశవ్యాప్తంగా ప్రోత్సహకాలు అందిస్తున్న కేంద్రం
గోదావరిఖని, వెలుగు: దేశంలో బొగ్గు వినియోగాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా కోల్ గ్యాసిఫికేషన్‌పై సింగరేణి సంస్థ దృష్టి సారించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి ఏరియాల్లోని డిప్‌సైడ్ గనుల్లో కోల్ గ్యాసిఫికేషన్ చేపట్టేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశంపై సంస్థ అధ్యయనం ప్రారంభించనుంది. ఈ నెల 11న హైదరాబాద్‌లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్‌షోలో సింగరేణి అధికారులు పాల్గొని ఈ దిశగా చేపడుతున్న చర్యలను వివరించనున్నారు.
కోల్ గ్యాసిఫికేషన్ అంటే..
భూగర్భంలో లభించే బొగ్గును నిర్దిష్ట పరిమాణంలో ఆక్సిజన్, నీటి ఆవిరితో మండించడం ద్వారా ‘సింథసిస్ గ్యాస్’(సింగాస్) ఉత్పత్తి చేస్తారు. ఈ గ్యాస్‌లో హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు ఉంటాయి. వీటిని విద్యుత్ ఉత్పత్తి, ఎరువుల తయారీకి అవసరమైన ఆమోనియా, మిథనాల్, పెట్రోకెమికల్స్ తయారీలో వినియోగించవచ్చు. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గే అవకాశం ఉంటుంది.
పర్యావరణానికి మేలు..
సంప్రదాయ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు, సిమెంట్ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో పోలిస్తే కోల్ గ్యాసిఫికేషన్ వల్ల పర్యావరణపై ప్రభావం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూగర్భంలోనే ప్రక్రియ నిర్వహిస్తే కాలుష్య కారకాలు బయటకు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. భూపరితలంపై నిర్వహించినా సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ యాక్సైడ్ల వంటి కాలుష్యకారకాలను గణనీయంగా నియంత్రించవచ్చు. అలాగే బొగ్గు అవశేషాలను సిమెంట్, ఇటుకల తయారీలో వినియోగించే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రోత్సాహకాలతో ముందడుగు..
దేశంలో కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఈ రంగ అభివృద్ధికి సుమారు రూ.46 వేల కోట్ల ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2030 నాటికి దేశవ్యాప్తంగా 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం, రామగుండం జల్లారం డిప్‌సైడ్ బ్లాక్, బెల్లంపల్లి డిప్‌సైడ్ బ్లాక్‌లలో కోల్ గ్యాసిఫికేషన్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అనే అంశంపై సింగరేణి సమగ్ర అధ్యయనం చేయనుంది. ఈ ప్రాజెక్టులు సాధ్యమైతే బొగ్గు ఆధారిత పరిశ్రమల్లో సాంకేతిక మార్పులకు దోహదపడటంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
