- సింగరేణి బకాయిలు చెల్లించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఆ సంస్థ కార్మికులు మంగళవారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధాను ముట్టడించారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియాలోని రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, కొత్తగూడెం, మణుగూరు తదితర బ్రాంచ్‌ల నుంచి కార్మికులు తరలివచ్చి పాల్గొన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని టీజీ జెన్కో సీఎండీ హరీశ్‌కు అందజేశారు.
సింగరేణి బకాయిలు రూ.19 వేల కోట్లు ఉండగా ప్రతి నెల రూ.200 కోట్లు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా సీఎండీ కార్మిక సంఘాల నేతలకు వివరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణికి ఇవ్వాల్సిన బకాయిలు, విద్యుత్ సంస్థల ద్వారా ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణి దివాళా తీసే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంస్థకు చెల్లించాల్సిన రూ.46 వేల కోట్లు ఇవ్వకపోవడంతో సంస్థ ఉద్యోగుల జీతాల కొరత ఏర్పడిందన్నారు.
సంక్షేమ పథకాలు, స్పేర్ పార్ట్స్, రక్షణ పరికరాలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణం బకాయిలు చెల్లించకపోతే అన్ని సంస్థలను కలుపుకొని ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షులు మందా నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి సంస్థను ఆర్థికంగా నిర్వీర్యం చేసి ప్రైవేటు వారికి అప్పగించడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని అన్నారు. గౌరవాధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ సింగరేణి డబ్బులను భట్టి విక్రమార్క మధిర అభివృద్ధికి, ముఖ్యమంత్రి కొడంగల్ అభివృద్ధికి, ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాలకు వాడుతున్నారని ఆరోపించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఈశ్వర్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న తదితరులు పాల్గొన్నారు.

