- శాస్త్రవేత్తలకు కలెక్టర్ సూచన
ఆదిలాబాద్టౌన్, వెలుగు: అకాల వర్షాలు, పురుగుల ఉధృతిని తట్టుకునే వంగడాల గురించి శాస్త్రవేత్తలు రైతులకు వివరించాలని, ‘ల్యాబ్ నుంచి ల్యాండ్ వరకు’ అనే నినాదంతో క్షేత్రస్థాయి పర్యటనలు పెంచాలని ఆదిలాబాద్కలెక్టర్రాజర్షి షా ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ లోని జడ్పీ మీటింగ్హాల్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన ‘ఉత్తర తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం(జడ్ఆర్ఈఏసీ)-’ సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు.
వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ఫలాలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరినప్పుడే సాగు లాభసాటిగా మారుతుందన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేలా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగిన సలహాలు అందించాలని కోరారు.
సాగులో డ్రోన్ల వినియోగం, నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వాడకం వంటి అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, డిమాండ్ ఉన్న ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటలు, అంతర పంటల సాగుపై రైతులను ప్రోత్సహించాలన్నారు. అనంతరం సోయాబీన్ విత్తనోత్పత్తి, చీడ పీడలకు సంబంధించిన అవగాహన పత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేడీఏ శ్రీధర్, పీజేటీఎస్ఏయూ పరిశోధన సంచాలకుడు ఎం.బాల్ రాజ్, విస్తరణ సంచాలకుడు యాకాద్రి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ శ్రీధర్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.

