భారతీయ స్టాక్ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు SIP పెట్టుబడులు రికార్డు స్థాయిలో నెలకు రూ.32వేల కోట్లు దాటేస్తుంటే.. మరోవైపు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అన్న నమ్మకంతో ఉన్న సామాన్యులకు, తమ పోర్ట్‌ఫోలియోలో కనిపిస్తున్న నెగటివ్ రిటర్న్స్ అస్సలు మింగుడుపడటం లేదు.
రిటర్న్స్ ఎందుకు పడిపోతున్నాయి?
గత ఏడాది కాలంగా మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. స్మాల్ క్యాప్ ఫండ్స్ 15%, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ 14% వరకు మైనస్ రిటర్న్స్ ఇచ్చాయి. మరీ ముఖ్యంగా టెక్నాలజీ ఫండ్స్ అయితే ఏకంగా 35% నుండి 47% వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్న యుద్ధాలు, అమెరికా టారిఫ్ నిర్ణయాలు, మార్కెట్ వ్యాల్యూయేషన్లు విపరీతంగా పెరగడమే. ఫండ్ మేనేజర్లు పెట్టుబడి పెట్టడానికి సరైన అవకాశాలు లేక, ఎక్కువ ధరకు షేర్లను కొనడం వల్ల రిటర్న్స్‌పై ప్రభావం పడిందని తేలింది.
ఇన్వెస్టర్లలో మొదలైన భయం..
లాభాలు రాకపోగా.. ఉన్న అసలు కూడా కరిగిపోతుండటంతో చాలామంది తమ సిప్‌లను ఆపేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా సిప్ క్యాన్సలేషన్ రేటు 100% దాటిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడే ఇన్వెస్టర్లు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సిప్ అనేది 1-3 ఏళ్ల స్వల్పకాలిక ప్రయాణం కాదు. గత 25 ఏళ్ల చరిత్రను చూస్తే.. మీరు నెలలో ఏ రోజు పెట్టుబడి పెట్టినా, దీర్ఘకాలంలో సగటున 14% నుండి 15% వరకు వార్షిక రిటర్న్స్ వచ్చాయి.
ALSO READ : మీ ఇంట్లో ఉన్న బంగారంపై వడ్డీ పొందొచ్చు
మరి పరిష్కారం ఏంటి?
ప్రస్తుత గందరగోళ సమయంలో భయపడి సిప్‌లు ఆపేయడం కంటే డైవర్సిఫికేషన్ పాటించడం మేలు. భారతీయ మార్కెట్ డల్‌గా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫండ్స్ కొంత మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే ఒక్కసారిగా మార్కెట్ నుండి బయటకు రాకుండా క్రమ పద్ధతిలో ఈక్విటీ నుండి డెట్ ఫండ్లలోకి డబ్బు క్రమంగా మార్చుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.
మార్కెట్ పడిపోయినప్పుడు తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లు వస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారు చిన్నపాటి మార్కెట్ కుదుపులకు భయపడకుండా క్రమశిక్షణతో పెట్టుబడిని కొనసాగించడమే అసలైన తెలివైన పని. నేటి ప్రతికూలతలే రేపటి భారీ లాభాలకు పునాదులు అని మర్చిపోవద్దు ఇన్వెస్టర్స్.
