న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కు ప్రజలంతా సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, స్పష్టత, విశ్వసనీయత పెంచడమే లక్ష్యంగా సర్ ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తీసుకువచ్చిందన్నారు. అయితే, ఈ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఈ మేరకు గురువారం సర్ పై ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల జాబితాను పారదర్శకంగా అప్‌డేట్ చేసేందుకు జరిగే ప్రక్రియకు బీజేపీ సహకరిస్తుందన్నారు.
అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతోందని తెలిపారు. ‘తెలంగాణలో ప్రారంభమైన సర్ ను రాష్ట్ర ఓటర్ల జాబితా సంస్కరణ ప్రక్రియగా చూడాలే తప్ప రాజకీయ కోణంలో కాదు. కొన్నిపార్టీలు, కొందరు రాజకీయ నాయకులు.. ఏదో జరిగిపోతోందంటూ రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారు. ఇది సరికాదు. అర్హుడైన ప్రతి పౌరుడికి ఓటుహక్కు ఉండాలి. అదే సమయంలో అక్రమ, నకిలీ, డూప్లికేట్ ఓటరు కార్డులను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది’ అని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలన్నారు. ఒక్క డూప్లికేట్ ఓటు, ఒక్క నకిలీ ఓటు కూడా కొత్త జాబితాలో ఉండకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని దిశా నిర్ధేశం చేశారు.
