దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు ! యూపీలో అత్యధికంగా ఓటర్లు ఔట్

దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు ! యూపీలో అత్యధికంగా ఓటర్లు ఔట్
  • తమిళనాడులో 97 లక్షలు, 
  • బెంగాల్​లో 90.8 లక్షల మంది పేర్లు డిలీట్

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (సర్) రెండో దశ పూర్తయింది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 7.2 కోట్ల అనర్హుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వాటిలో 2.89 కోట్లతో ఉత్తరప్రదేశ్  టాప్ లో ఉండగా.. తమిళనాడు (97 లక్షలు), వెస్ట్  బెంగాల్ (90.8 లక్షల ఓటర్లతో) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే ఫాం 6 ద్వారా 2 కోట్ల ఓటర్లను కలిపారు. ఇక ఈ ప్రక్రియ తర్వాత ఆ రాష్ట్రాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 45.8 కోట్లకు చేరింది. అంతకుముందు ఈ సంఖ్య 51 కోట్లుగా ఉంది. అంటే దాదాపు 10.2 శాతం ఓటర్ల సంఖ్య తగ్గింది. 

కాగా.. నిరుడు అక్టోబరులో బిహార్  అసెంబ్లీ ఎన్నికల ముందు సర్  ప్రక్రియ ప్రారంభించారు. తర్వాత 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి విస్తరించారు. 

  • ఇందుకోసమే పేర్లు తీసేశారు

ఓటర్లను తొలగించడానికి గల కారణాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. రిజిస్టర్  చేసుకున్న అడ్రస్ లో ఓటర్లు నివసించకపోవడం (13 కోట్ల మంది), పూర్తిగా మరో ప్రాంతానికి వెళ్లిపోవడం (3.1 కోట్ల మంది), చనిపోయిన వారి పేర్లు, డూప్లికేట్‌, ఇతర కారణాల వల్ల (1.2 కోట్ల మంది) ఓటర్ల పేర్లను తొలగించామని ఈసీ అధికారులు వివరించారు. పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచేందుకే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. 

  • పర్సంటేజీల వారీగా డిలీషన్లు ఇలా ఉన్నాయి

అండమాన్  అండ్  నికోబార్  ఐలాండ్ లో అత్యధికంగా 16.6 శాతం, యూపీలో 13.2, గుజరాత్  లో 13.1, చత్తీస్ గఢ్ లో 11.3, వెస్ట్ బెంగాల్ లో 10.9, తమిళనాడులో 10.6, గోవాలో 10.2, మధ్యప్రదేశ్ లో 5.7, రాజస్తాన్ లో 5.4, కేరళలో 2.5, లక్షద్వీప్ లో 0.3, పుదుచ్చేరిలో 7 శాతం ఓట్లు తొలగించారు. 

  • అడిషన్లలో యూపీ టాప్

ఓటర్ల పేర్ల తొలగింపుతో పాటు అడిషన్లు కూడా చేశామని అధికారులు వెల్లడించారు. యూపీలో అత్యధికంగా 92.4 లక్షల మందిని యాడ్  చేయగా.. తమిళనాడులో 35 లక్షలు, రాజస్తాన్ లో 15.4 లక్షలు, మధ్యప్రదేశ్ లో 12.9 లక్షలు, గుజరాత్ లో 12 లక్షల పేర్లను ఓటర్ల జాబితాలోకి చేర్చారు.