- మూడో దశలో మొత్తం 16 రాష్ట్రాల్లో ప్రక్రియ
- మన రాష్ట్రం, పంజాబ్‌లో ఒకేసారి ప్రత్యేక సమగ్ర సవరణ
- జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బందికి శిక్షణ
- అక్టోబర్ 1న తుది జాబితా విడుదల.. ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
- రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 3.39 కోట్ల ఓటర్లు.. ఇప్పటికీ మ్యాపింగ్ 58 శాతమే
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది. మూడో దశ ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఈసీఐ గురువారం ప్రకటించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటరు జాబితాను మరింత పారదర్శకంగా, దోషరహితంగా మార్చడమే లక్ష్యంగా ఈ భారీ కసరత్తును చేపట్టారు.
దేశవ్యాప్తంగా ఉన్న 36.73 కోట్ల మంది ఓటర్లను చేరుకునేందుకు సుమారు 3.92 లక్షల మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) క్షేత్రస్థాయిలో పని చేయనున్నారు. రాజకీయ పార్టీల ద్వారా నియమితులైన 3.42 లక్షల మంది బూత్ స్థాయి ఏజెంట్లు (బీఎల్ఏలు) కూడా బీఎల్ఓలకు సహకారం అందించనున్నారు.
దేశవ్యాప్త జనగణన ప్రక్రియ, యంత్రాంగంపై భారం పడకుండా హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్ వంటి ప్రాంతాలకు ఈ దశ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఈసీఐ స్పష్టం చేసింది. ఇక మన రాష్ట్రంలో జూన్ 15 నుంచి 24 వరకు బీఎల్ఓలకు శిక్షణ, జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే, జులై 31న ముసాయిదా జాబితా ప్రచురణ, సెప్టెంబర్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టి, అక్టోబర్ 1న తుది జాబితాను ప్రకటించనున్నారు.
తెలంగాణ, పంజాబ్ రాష్ట్రంతో పాటు ఒకే సమయం లో ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియను చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను సరిచూసేందుకు సుమారు 35,985 మంది బీఎల్ఓలు, 25,886 మంది బీఎల్ఏలు రంగంలోకి దిగనున్నారు. ఈ భారీ ప్రక్రియ కోసం జూన్ 15 నుంచి 24 వరకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. తర్వాత జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటి సర్వే చేపట్టి వివరాలు సేకరిస్తారు.
ఈ వివరాలన్నీ క్రోడీకరించి జులై 31న ఓటర్ల ముసాయిదా జాబితాను ఈసీఐ విడుదల చేస్తుంది. ఆరోజు నుంచే సెప్టెంబర్ 28 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను, పేర్ల నమోదు, తొలగింపు వంటి ఫిర్యాదులను అధికారులకు తెలియజేయవచ్చు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఈసీఐ ఆదేశించింది.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇంటి తాళాలు వేసి ఉండటం, ఓటర్లు నివాసాలు మార్చుకోవడం వల్ల బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో సవాళ్లు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించేందుకు ముందస్తు ప్రణాళికలతో వెళ్లాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఆ మూడు జిల్లాల్లో మ్యాపింగ్ పూర్
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,39,36,771 మంది ఓటర్లకు గాను సుమారు 58 శాతం మేర మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో ఓటర్ల జాబితాను ప్రస్తుత వివరాలతో అనుసంధానించడం, ఓటర్ల వారసుల వివరాలను మ్యాప్ చేశారు. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలు మ్యాపింగ్ ప్రక్రియలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఈ విషయంలో వెనుకబడి ఉండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
భారీ అపార్టుమెంట్లు ఎక్కువగా ఉండడం, కనీసం 20 శాతం మంది ఓటరు కార్డులో ఉన్న చిరునామాలో ఉండకపోవడం బీఎల్ఓలకు ప్రధాన సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు గ్రామీణ జిల్లాలైన రాజన్న సిరిసిల్ల 80 శాతం మ్యాపింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలు 70 శాతానికి పైగా పూర్తి చేసి ముందంజలో ఉన్నాయి. పట్టణ, నగర ప్రాంతాల్లో ఓటర్ల కదలికలు, అడ్రస్ మారడం వంటి చిక్కులను అధిగమించడానికి బీఎల్ఓలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపుతో పార్టీల అప్రమత్తం
ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓటరు సవరణ ప్రక్రియలో భారీగా ఓట్లు తొలగిపోవడం, అర్హులైన వారి పేర్లు సైతం జాబితా నుంచి గల్లంతు కావడం వంటి పరిణామాలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకుకు గండి పడుతుందేమోనన్న ఆందోళనలో ఉన్న పార్టీలు, ఈసారి క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఓటు నమోదు ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాయకులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తమ పార్టీల నుంచి బూత్ స్థాయి ఏజెంట్లను (బీఎల్ఏ) సమర్థవంతంగా నియమించుకుని, ఇంటింటి సర్వే సమయంలో బీఎల్ఓల పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని పార్టీలు తమ శ్రేణులకు దిశానిర్దేశం చేశాయి. ముఖ్యంగా ఓట్ల తొలగింపు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని భావిస్తున్న ప్రతిపక్షాలు, జాబితా నుంచి ఎవరి పేరు తొలగించినా వెంటనే అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నాయి.
ఓటరు నమోదు, సవరణ, తొలగింపులపై ఎప్పటికప్పుడు డేటాను సేకరిస్తూ, తమ ఓటర్ల జాబితాను కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఏజెంట్లు లేకపోతే ఓట్ల తొలగింపును అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించిన పార్టీలు, ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని కార్యకర్తలకు సూచిస్తున్నాయి.
