- స్కాన్ చేస్తే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌కు సంబంధించిన వీడియో
- ఆవిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ ‘క్యూఆర్’ కోడ్‌తో కూడిన పట్టు శాలువాను నేశాడు. ‘మోడీ మన నాడీ’ పేరుతో శాలువాపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే.. అయోధ్య రామమందిరం, ఆపరేషన్ సిందూర్, డిజిటల్ ఇండియా, చంద్రయాన్- 3, వందే భారత్, స్వచ్ఛభారత్ వంటి కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌కు సంబంధించిన వివరాలు ప్లే అయ్యేలా రూపొందించారు.
ఈ శాలువాను కేంద్ర మంత్రి బండి సంజయ్ మంగళవారం ఆవిష్కరించారు. 32 ఇంచుల వెడల్పు, రెండున్నర మీటర్ల పొడవు ఉన్న ఈ శాలువాను తయారు చేయడానికి 12 రోజుల సమయం పట్టిందని కార్మికుడు విజయ్ తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యూఆర్ కోడ్‌తో కూడిన శాలువాను తయారుచేశానని, ఈ శాలువాను త్వరలోనే ప్రధాని మోదీకి అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా విజయ్‌ని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభినందించారు.
