పాపం ఈ అక్కాచెల్లెలు: ఘట్కేసర్‎లో పశువులకు నీరు తాగించడానికి వెళ్లి గుంతలో పడి ఇద్దరు మృతి

పాపం ఈ అక్కాచెల్లెలు: ఘట్కేసర్‎లో పశువులకు నీరు తాగించడానికి వెళ్లి గుంతలో పడి ఇద్దరు మృతి

హైదరాబాద్: పశువులకు నీరు తాగించడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. మృతులు ఇద్దరూ సొంత అక్కాచెల్లెలు. ఈ విషాద ఘటన హైదరాబాద్ శివారు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందుపట్ల గూడలో జరిగింది. వివరాల ప్రకారం.. అంకుషాపూర్‎కు చెందిన కొండల మల్లేష్‎కు హరిణి (16), గాయత్రి (13) ఇద్దరు కుమార్తెలు. హరిణి కేంద్రీయ విశ్వవిద్యాలయలో ఇంటర్ చదువుతుండగా.. హోలిపేత్ స్కూల్‎లో గాయత్రి తొమ్మిదో తరగతి చదువుతుంది.

ఆదివారం (అక్టోబర్ 26) స్కూళ్లకు సెలవు కావడంతో పశువులకు నీళ్లు తాగించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ గుంతలో పడి అక్కాచెల్లెలు గల్లంతయ్యారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి వెతకసాగారు. చివరకు నీటి గుంతలో గల్లంతు అయినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహయంతో హైడ్రా సిబ్బంది నీటి గుంతలో ముమ్మురంగా గాలించారు. 

ఆదివారం (అక్టోబర్ 26) అర్ధరాత్రి హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ హాస్పిటల్‎కి తరలించారు. అప్పటి వరకు కళ్లు ముందు తిరిగిన కూతుర్లు ఇద్దరూ విగతజీవులుగా మారడంతో మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఒకేసారి కూతుర్లు ఇద్దరూ చనిపోవడంతో గుండెలవిసేలా రోదించారు. 

మృతుల తల్లిదండ్రులను ఆపడం ఎవరితరం కాలేదు. పిల్లల తల్లిదండ్రులు రోదించిన తీరు చూసి అక్కడికి వచ్చినవారందరూ కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కాచెల్లెలు ఇద్దరూ ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడిపోయారా..? మరణానికి మరేదైనా కారణం ఉందా అన్నా కోణంలో ఆరా తీస్తున్నారు.