
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో సిట్ నోటీసులు గందరగోళం సృష్టిస్తున్నాయి. నోటీసుల్లో పేర్కొన్న మొబైల్ నంబర్, ఐఎమ్‌ఈఐ నంబర్లు చర్చనీయాంశంగా మారాయి. శనివారం సోషల్ మీడియాలో అవి వైరలవడంతో సిట్ అలర్ట్ అయ్యింది. అది యాదృచ్ఛికంగా జరిగిందా, దర్యాప్తులో భాగంగా ఇచ్చారా అనే వివరాలను సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. రామచంద్ర భారతి ఆడియో రికార్డింగ్స్, చాటింగ్స్ ఆధారంగా కరీంనగర్‌కు చెందిన లాయర్ శ్రీనివాస్‌కు 41(ఏ) సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసింది. బీఎల్ సంతోష్‌కూ నోటీసులిచ్చినట్లు మరో నోటీసు సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యింది.
బీఎల్ సంతోష్, శ్రీనివాస్‌ల పేరుతో ఇచ్చిన నోటీసుల్లో #####415 నంబర్ సిమ్, ఐఎంఈఐ నంబర్ 353846108#####తో కూడిన సెల్‌ఫోన్‌ను విచారణకు తేవాలని సూచించారు. ఐతే ఇద్దరి పేర్లతో ఉన్న నోటీసుల్లో ఒకే నంబర్ ఉండడం అనుమానాలకు తావిస్తున్నది. నోటీసుల ఫార్మాట్ అంతా ఒక్కటే కావడంతో పేరు, అడ్రస్ మార్చి నోటీసులు జారీ చేశారన్న అనుమానాలు వస్తున్నాయి. దీంతో సిట్.. మరోసారి నోటీసులు జారీ చేసింది.