2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. 15 రోజుల్లోనే 618 ఫోన్లు ట్యాప్

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. 15 రోజుల్లోనే 618 ఫోన్లు ట్యాప్
  • 2021 నుంచి 2023 వరకూ ట్యాప్ అయినవి ఇంకెన్నో? 
  • ఆ మూడేండ్ల ట్యాపింగ్‌‌‌‌ డేటా ఇవ్వండి
  • టెలికాం సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్లకు లేఖ రాసిన సిట్ 
  • ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌లో ప్రభాకర్ రావు సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ 
  • ఫార్మాట్‌‌‌‌ చేసిన డేటా రిట్రీవ్‌‌‌‌ చేసేందుకు యత్నం  
  • ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ తో ఎవరు లాభపడ్డరో తేల్చడంపై ఫోకస్  
  • టెక్నికల్ ఆధారాలతో త్వరలోనే చార్జిషీట్‌‌‌‌ దాఖలుకు సిద్ధం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసులో సిట్‌‌‌‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్‌‌‌‌ఐబీ నుంచి టెలికాం సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్లకు అందిన ఫోన్ నంబర్ల వివరాలను రాబడుతున్నారు. ఈ మేరకు 2021 నుంచి 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌ వరకు ట్యాపింగ్‌‌‌‌ చేసిన ఫోన్ నంబర్ల లిస్టులు అందించాలని ఐదు టెలికాం సంస్థలకు లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్‌‌‌‌‌‌‌‌15 నుంచి 30 వరకు కేవలం15 రోజుల వ్యవధిలోనే 618 మంది నంబర్లు ట్యాపింగ్‌‌‌‌ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. 

ఇందులో ఆయా నంబర్ల ఆధారంగా కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ ప్రముఖ నేతలు సహా సుమారు 250 మందికి పైగా స్టేట్‌‌‌‌మెంట్లు రికార్డ్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలోనే 2021లో జరిగిన హుజూరాబాద్‌‌‌‌, 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలు సహా మూడేండ్ల వ్యవధిలో సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన ఫోన్‌‌‌‌ నంబర్లు ఇంకెన్ని ఉన్నాయో అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు. కీలక ఆధారాలతో త్వరలోనే చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

2018 నుంచే ట్యాపింగ్ షురూ.. 

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందించిన లిస్టుతో పాటు నిందితులు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఐన్యూస్ ఎండీ శ్రవణ్‌‌‌‌రావు ఫోన్‌‌‌‌ డేటా, కాల్‌‌‌‌ డేటా రికార్డింగ్‌‌‌‌(సీడీఆర్‌‌‌‌) ఆధారంగానే సిట్‌‌‌‌దర్యాప్తు కొనసాగుతున్నది.2018 ఎన్నికల నుంచే ‘స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్‌‌‌‌’ మొదలైనట్టు గుర్తించింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ అధినేత కేసీఆర్‌‌‌‌కు ‌‌‌‌రాష్ట్రంలో తిరుగులేకుండా చేసేందుకు అడ్డగోలుగా ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ చేసినట్లు సాంకేతిక ఆధారాలు సేకరించింది. 

ప్రణీత్‌‌‌‌రావు టీమ్‌‌‌‌ ధ్వంసం చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌‌‌‌(ఎస్‌‌‌‌ఐబీ) హార్డ్‌‌‌‌ డిస్కుల్లో 30 ఏండ్ల డేటా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అప్పట్లో ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌గా ఉన్న రిటైర్డ్‌‌‌‌ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు పోస్టింగ్‌‌‌‌ ఇచ్చిన నాటి నుంచే స్పెషల్ ఆపరేషన్స్‌‌‌‌ టార్గెట్‌‌‌‌(ఎస్‌‌‌‌ఓటీ) బృందం ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌కు పాల్పడినట్లు సిట్‌‌‌‌గుర్తించింది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌‌‌‌ రిపోర్టులు సహా సర్వీస్ ప్రొవైడర్లు అందించే ట్యాపింగ్‌‌‌‌ లిస్ట్‌‌‌‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నది. 

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రావుతోనే చెప్పించే యత్నం.. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 8 సార్లు విచారించినా ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించలేదని తెలిసింది. సోదాల సమయంలో అందించని సెల్‌‌‌‌ఫోన్లు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ ను ఆ తరువాత ఫార్మాట్‌‌‌‌ చేసినట్లు సిట్‌‌‌‌ అనుమానిస్తున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరాలు వెల్లడించింది. అయితే ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వల్ల తను ఎలాంటి సొంత లాభం పొందలేదని ప్రభాకర్ రావు చెప్పగా.. మరి ఎవరి ఆదేశాల కోసం, ఎవరి లబ్ధి కోసం ట్యాంపింగ్‌‌‌‌ చేశారు? అన్నది ఆయన నోటితోనే చెప్పించేందుకు సిట్‌‌‌‌అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌ ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌‌‌‌కు పంపించారు. ఫార్మాట్‌‌‌‌ చేసిన డేటాను రిట్రీవ్‌‌‌‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్‌‌‌‌ దర్యాప్తులో సర్వీస్ ప్రొవైడర్ల డేటా కీలకంగా మారింది. అయితే, కేవలం 15 రోజుల ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ డేటా మాత్రమే సిట్‌‌‌‌ వద్ద ఉండడంతో కేసు తీవ్రతను వెల్లడించేందుకు 2021 నుంచి ట్యాపింగ్‌‌‌‌ జరిగిన ఫోన్‌‌‌‌ నంబర్లను కూడా సేకరిస్తున్నారు. పూర్తి సాంకేతిక ఆధారాలతో చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేయనున్నారు.