లాడెన్ ను అమెరికా చంపినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చేయాలి : శివసేన

లాడెన్ ను అమెరికా చంపినట్టుగా సర్జికల్ స్ట్రైక్ చేయాలి : శివసేన
  • శ్రీలంకలా తెగువ చూపితే.. 100 పాక్ లను తుడిచి పెట్టొచ్చు

ముంబై: పుల్వామా దాడి నేపథ్యంలో బీజేపీ మిత్ర పక్షం శివసేన మరోసారి ప్రధాని మోడీపై విమర్శలకు దిగింది. సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సింది రాజకీయ ప్రత్యర్థులపై కాదని, పాకిస్థాన్ పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని సూచించింది. తన పార్టీ పత్రిక సామ్నాలో సోమవారం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంపాదకీయం రాశారు. ‘‘దేశంలో రాజకీయాలు ఎన్ని రకాలుగా మారినా కశ్మీర్ అంశం మాత్రం అలానే ఉంది, జవాన్ల ప్రాణాలు పోతూనే ఉన్నాయి’’ అన్నారు. దేశంలో రాజకీయంగా సాధించిన విజయాలేవీ కశ్మీర్ సమస్యను పరిష్కరించలేకపోయాయని ఉద్దవ్ చెప్పారు.

పుల్వామా దాడి చేసిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోడీ మాటలు చెప్పి సరిపెట్టడం కాదని, చేతల్లో చూపించాలని అన్నారాయన. ప్రపంచంలో పాకిస్థాన్ ను ఒంటరిని చేసినా ఉగ్రవాదులను భారత్ పైకి పంపుతూనే ఉందని, జవాన్ల త్యాగానికి ప్రతిఫలంగా పాక్ పై దాడి చేయాల్సిందేనని చెప్పారు.

సర్జికల్ స్ట్రైక్ అంటే అమెరికాలా చేయాలి

2016లో ఉరీ దాడి తర్వాత ఆర్మీ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ‘ఛాతీ ఉప్పొంగడం’ కోసం చేసుకున్నట్లుగా ఉందని ఠాక్రే ఆరోపించారు. అసలు సర్జికల్ స్ట్రైక్ అంటే ఎలా ఉండాలో అమెరికా చేసి చూపిందన్నారు. అమెరికా ట్విన్ టవర్స్ పై జరిగిన 9/11 దాడికి ప్రతీకారంగా నేరుగా పాకిస్థాన్ లోకి వెళ్లి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను మట్టుబెట్టిందని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ అంటే అలా చేయాలని చెప్పారు.

శ్రీలంకలా తెగువ చూపాలి

భారత ప్రభుత్వం కూడా శ్రీలంకలా ధైర్యం, తెగువ చూపి ఉంటే 100 పాకిస్థాన్లను తుడిచి పెట్టేసి ఉండొచ్చని శివసేన అభిప్రాయపడింది. LTTE తీవ్రవాద సంస్థ బెడదను శ్రీలంక సైన్యం పూర్తిగా తుడిచిపెట్టిందని ఉద్దవ్ అన్నారు. అంత చిన్న దేశం ఉగ్రవాదం లేని దేశంగా మారగలిగినప్పుడు.. భారత్ అదే తెగువ చూపితే పాక్ లాంటి 100 దేశాలను మట్టుబెట్టొచ్చన్నారు. ఇప్పుడు రాజకీయాలు ప్రదర్శించే టైం కాదని, జవాన్లకు అండగా నిలవాల్సిన సమయమని చెప్పారు.