నక్సల్స్​ పేరుతో ఫోన్లు చేసి బెదిరింపు

నక్సల్స్​ పేరుతో ఫోన్లు చేసి బెదిరింపు

మంచిర్యాల, వెలుగు: ఎయిర్​గన్స్​తో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆరుగురు సూడో నక్సల్స్​ను పోలీసులు అరెస్టు చేశారు. సీపీ రెమా రాజేశ్వరి గురువారం మంచిర్యాల జిల్లా డీసీపీ ఆఫీస్​లో ప్రెస్​మీట్​ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలకు చెందిన మేడి వెంకటేశ్(26), పెద్దంపేటకు చెందిన ఆరెందుల రాజేశ్(31) ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి కొంతకాలంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఈ మధ్య బిజినెస్​ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సులువుగా డబ్బులు సాధించాలని నక్సల్స్​ పేరుతో ఫోన్లు చేసి బెదిరించాలని అనుకున్నారు. వెంకటేశ్ ​హైదరాబాద్​లో రెండు ఎయిర్ గన్స్​ కొన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి దగ్గర సెల్​ఫోన్, సిమ్​కార్డు కొన్నారు. నస్పూర్​లో కాంతయ్య ఇంటి వద్ద రెక్కీ చేశారు. ఫిబ్రవరి 21న రాత్రి రాజేశ్​  చెప్పిన ప్రకారం వెంకటేశ్​ ఎయిర్ గన్స్​ తీసుకెళ్లి ఇంటి ఆవరణలో ఉంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు తెల్లవారుజామున కాంతయ్య, అతని కొడుకు నాగరాజుకు ఫోన్ చేసి తిర్యాణి అడవుల నుంచి నక్సల్స్​ మాట్లాడుతున్నామని తెలిపారు. మీ ఇంటి ముందు తుపాకులు పెట్టామని, మీరు రూ.40 లక్షలు ఇవ్వకపోతే కుటుంబసభ్యులను చంపుతామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల రూరల్ సీఐ సంజీవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్​ఎవిడెన్స్​సేకరించి నిందితులను అరెస్ట్​ చేశారు. రాజేశ్​పై గతంలో మంచిర్యాల, హాజీపూర్ ఏరియాల్లో పలు కేసులున్నాయి. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంజీవ్, నస్పూర్​ ఎస్సై ఎం.రవికుమార్, కానిస్టేబుళ్లు ఎండీ. సలీం, బి.దేవేందర్, శ్రీధర్, ఇర్షాద్​లను సీపీ రెమా రాజేశ్వరి రివార్డ్ అందజేసి అభినందించారు. 

మహబూబాబాద్​లో నలుగురు..

మహబూబాబాద్: మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్​చే సిన నలుగురు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్​ఇన్​చార్జి డీఎస్పీ రమణబాబు తెలిపిన వివరాల ప్రకారం..ప్రజా ప్రతిఘటన దళ కమాండర్ గా పనిచేసిన ఉప్పునూతల ముత్తయ్య, మరో ముగ్గురు కలిసి మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేద్దామని ప్లాన్​వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొల్లి యాదగిరి రెడ్డి పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తుంటాడు. బయ్యారం మండలం  కొత్తపేట గ్రామ పరిధిలో ఉన్న తన పొలానికి ఇల్లందు నుంచి వచ్చి పోతుండేవాడు. యాదగిరిరెడ్డిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు 15 రోజులు రెక్కీ చేశారు. గత ఏడాది డిసెంబర్​20న పొలానికి వచ్చిన యాదగిరిరెడ్డిన మధ్యాహ్న సమయంలో ఎయిర్​పిస్టల్​తో బెదిరించి కిడ్నాప్ చేశారు. బైక్ పై చింతోని గుంపు అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మావోయిస్టు పార్టీకి  రూ.20 లక్షల చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి భయపడి కొడుకుకు చెప్పి రూ.1.25 లక్షలు తెప్పించి ఇచ్చాడు. నలుగురూ నకిలీ నక్సలైట్లని అనుమానించిన యాదగిరిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం వెహికల్స్​తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి నలుగురూ పారిపోతుండగా పట్టుకున్నారు. ఉప్పనూతల ముత్తయ్య, పసుల లింగయ్య, బత్తుల రామకృష్ణ, నిమ్మల లింగయ్యను అరెస్టు చేసి వారి నుంచి ఒక ఎయిర్​గన్, నాలుగు సెల్ ఫోన్స్-, రెండు బైక్​లు, రూ.1.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.