హైదరాబాద్, వెలుగు: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోందని, దేశీయంగానే ఈ–కారు తయారీపై దృష్టి పెట్టామని స్కోడా ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా అన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో మోడీ ఇండియా కార్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఔట్‌లెట్‌ను ప్రారంభించాక మీడియాతో మాట్లాడారు. ఈవీల దిగుమతులపై పన్నులు ఎక్కువ కాబట్టే స్థానిక తయారీ గురించి ఆలోచిస్తున్నామని చెప్పారు.
‘మా కంపెనీ తెలంగాణలో విస్తరిస్తోంది. తెలంగాణలోనే టచ్ పాయింట్ల సంఖ్య 19 కి చేరింది. ఇందులో 15 హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. త్వరలో ఖమ్మంలో కొత్త సెంటర్ ప్రారంభిస్తాం. మొత్తం అమ్మకాల్లో తెలంగాణ వాటా 6.5 శాతంగా ఉంది. జాతీయ స్థాయిలో మార్కెట్ వాటా 2.5 శాతంగా ఉంటే తెలంగాణలో 3.5 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 183 నగరాల్లో 330 టచ్ పాయింట్లు ఉన్నాయి.
భారత్‌లో మూడు శాతం మార్కెట్ వాటా సాధించడమే లక్ష్యం. కైలాక్ కారు బాగా అమ్ముడవుతోంది. పండుగ సీజన్లో స్లావియా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేస్తాం. యుద్ధం వల్ల షిప్పింగ్ ఖర్చులు పెరిగినా ప్రస్తుతం వినియోగదారులపై భారం వేయడం లేదు”అని ఆయన వివరించారు.
