వచ్చే ఏడాది నుంచి నెలకో రాకెట్ లాంచ్.. క్యాబ్ మోడల్లా సర్వీస్లు.. భవిష్యత్లో స్పేస్ టూరిజం కూడా!

వచ్చే ఏడాది నుంచి నెలకో రాకెట్ లాంచ్.. క్యాబ్ మోడల్లా సర్వీస్లు.. భవిష్యత్లో స్పేస్ టూరిజం కూడా!
  • స్కైరూట్‌‌ సీఈఓ పవన్ కుమార్ చందన వెల్లడి
  • కమర్షియల్ సర్వీస్‌‌లు అందించడంపై ఫోకస్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  హైదరాబాద్ స్టార్టప్‌‌ కంపెనీ స్కైరూట్‌‌ ఏరోస్పేస్  వచ్చే ఏడాది నుంచి నెలకో రాకెట్‌‌ను కక్ష్యలోకి పంపుతామని  ప్రకటించింది.   రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి కమర్షియల్ లాంచింగ్‌‌లోకి అడుగుపెడతామని తెలిపింది.  ఈ ఏడాది చివర్లోనే మరో లాంచ్‌‌  ఉంటుందని కంపెనీ సీఈఓ పవన్ కుమార్ చందన  పేర్కొన్నారు.  విక్రమ్-1 రాకెట్‌‌ లాంచ్ సక్సెస్‌‌ అవ్వడంతో ఆయనీ  విషయాలను పంచుకున్నారు. 

స్పేస్ రంగంలో 'క్యాబ్' మోడల్ 

స్పేస్ లాంచ్‌‌లను కూడా సాధారణ క్యాబ్ బుకింగ్ లాగా సులభతరం చేయడం స్కైరూట్ ప్రధాన ఉద్దేశం.  చిన్న ఉపగ్రహాలను కస్టమర్లు కోరుకున్న షెడ్యూల్, కక్ష్యలో ప్రవేశపెట్టడానికి వీలుగా విక్రమ్-1 ను డిజైన్ చేశామని పవన్ తెలిపారు. దీనిని స్పేస్ మార్కెట్‌‌లో 'క్యాబ్ సర్వీస్'  లాంటి సేవగా ఆయన అభివర్ణించారు. సాధారణంగా  పెద్ద రాకెట్లలో  వేరువేరు శాటిలైట్లను పంపడంతో,  కొన్నిసార్లు కంపెనీలు తాము కోరుకున్న కక్ష్యలోకి వెళ్లడం కుదరదు. 

స్కైరూట్ అందిస్తున్న మోడల్ ద్వారా శాటిలైట్ కంపెనీలు తమకు నచ్చినట్లు రాకెట్‌‌ను బుక్ చేసుకుని, వారు అనుకున్న కచ్చితమైన ప్రదేశంలో శాటిలైట్‌‌ను ప్రవేశపెట్టొచ్చు. దీనినే  'క్యాబ్- టు- స్పేస్' మోడల్‌‌గా పవన్‌‌ పేర్కొన్నారు.
     

  • కమర్షియల్ లాంచ్‌‌లు

    
విక్రమ్-1 విజయవంతంగా కక్ష్యకు చేరుకోవడంతో, ప్రైవేట్ రంగంలో ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని అతికొద్ది దేశాల సరసన ఇండియా చేరింది. దీంతో పవన్ తమ ఫ్యూచర్ ప్లాన్స్‌‌ను పంచుకున్నారు.  ఇకపై స్కైరూట్ పూర్తిస్థాయి కమర్షియల్ లాంచ్‌‌లపై   దృష్టి పెడుతుందని తెలిపారు. ప్రతి నెలా ఒక రాకెట్‌‌ను తయారు చేయగల సామర్థ్యంతో తమ ప్రొడక్షన్ ఫెసిలిటీని వేగంగా విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేర్వేరు ప్రైవేట్ కంపెనీలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు లేదా వివిధ దేశాల ప్రభుత్వాలు తమ కమ్యూనికేషన్, వాతావరణ సమాచారం, లేదా గూగుల్ మ్యాప్స్ లాంటి సేవల కోసం శాటిలైట్లను (ఉపగ్రహాలను) తయారు చేసుకుంటాయి.  ఆయా సంస్థల దగ్గర శాటిలైట్లు ఉంటాయి కానీ, వాటిని అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్లు ఉండవు. 

అందుకని వారు స్కైరూట్ లాంటి కంపెనీలకు డబ్బులు చెల్లించి, వారి 'విక్రమ్' వంటి రాకెట్ల ద్వారా తమ శాటిలైట్లను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టమని కాంట్రాక్ట్ ఇస్తారు. ఇంతకుముందు  ఇండియాలో ఈ పనిని కేవలం ప్రభుత్వ సంస్థ అయిన ఇస్రో  మాత్రమే చేసేది. కానీ ఇప్పుడు స్కైరూట్ లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా రంగంలోకి దిగడంతో, వేరే కంపెనీల శాటిలైట్లను లాంచ్ చేయడానికి కొత్త ప్రైవేట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. 

  • మొదలైన విక్రమ్‌‌2 పనులు

 విక్రమ్-1 లాంచ్‌‌లను క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే, మరోవైపు తదుపరి తరం రాకెట్ అయిన 'విక్రమ్-2' అభివృద్ధిని వేగవంతం చేస్తున్నామని  పవన్‌‌ అన్నారు.  ఈ సరికొత్త రాకెట్ మోసుకెళ్లే సామర్థ్యం విక్రమ్-1 కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని  వివరించారు. స్కైరూట్ కేవలం భారత్‌‌కే పరిమితం కాకుండా ప్రపంచంలోనే లీడింగ్ శాటిలైట్ లాంచ్ సర్వీస్ ప్రొవైడర్‌‌గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ప్రస్తుతం కంపెనీకి ఉన్న క్లయింట్లలో ఎక్కువ భాగం యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్ల నుంచే ఉన్నారని పవన్‌‌ స్పష్టం చేశారు. స్కైరూట్ మార్కెట్‌‌లో దాదాపు 70శాతం–-80శాతం గ్లోబల్ కస్టమర్ల నుంచే డిమాండ్ ఉందని, ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా దేశాల నుంచి కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ల ప్రయోగాల కోసం ఆర్డర్లు వస్తున్నాయని గతంలో ఆయన పేర్కొన్నారు.

 స్పేస్‌‌ఎక్స్‌‌ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో తక్కువ ఖర్చు,  నిరంతర సర్వీసుల ద్వారా పోటీ పడగలమని ధీమా వ్యక్తం చేశారు. రాకెట్‌‌ను విజయవంతంగా నిర్మించడం అనేది శాటిలైట్ లాంచ్‌‌లకే కాకుండా భవిష్యత్తులో స్పేస్ టూరిజం (మనుషులను పంపడం), అంతరిక్షంలో ఫ్యాక్టరీలు/డేటా సెంటర్ల ఏర్పాటు వంటి ఎన్నో భారీ వ్యాపార అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని పవన్ వివరించారు.