సిటీలో ఊపందుకున్న స్కై వే పనులు

సిటీలో ఊపందుకున్న స్కై వే పనులు
  • స్పీడ్​గా.. స్కై వేలు
  • మళ్లీ పనులను ప్రారంభించిన హెచ్ఎండీఏ
  • తొలి దశలో ఉప్పల్, మెహిదీపట్నంలో నిర్మాణాలు
  • కరోనాతో నాలుగు నెలల కిందట ఆగిన పనులు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని ట్రాఫిక్​ జంక్షన్లలో జనాలు ఈజీగా రోడ్డు దాటేందుకు చేపట్టిన స్కై వాక్ వే ల పనులను హెచ్ఎండీఏ స్పీడప్ చేసింది. కరోనాతో కూలీలు లేక, ఆక్సిజన్ కొరతతో నాలుగు నెలలుగా పనులు నిలిచిపోయాయి. తాజాగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ దొరుకుతుండగా ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వచ్చే నాలుగు నెలల్లో ఉప్పల్ స్కై వాక్ వే నిర్మాణం పూర్తి చేయనుంది. మెహిదీపట్నంలో ఇటీవల పనులు అప్పగించింది. ఈ రెండు  చోట్ల 60‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోట్ల అంచనాతో నిర్మిస్తోంది. ఆ తర్వాత దిల్ సుఖ్ నగర్, ఎల్​బీనగర్​, సికింద్రాబాద్, ఐటీ కారిడార్ లోని రద్దీ ఏరియాల్లోనూ నిర్మించనుంది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్కై వాక్ వే లు కావడంతో కరోనాతో పనులు నిలిచిపోయాయి.  సరిపడినంత ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో ఫ్యాబ్రికేటెడ్ పనులు జరగలేదని అధికారులు తెలిపారు.

రూ. 60 కోట్లతో రెండు ప్రాంతాల్లో..
ఉప్పల్ రింగ్ రోడ్డులో రూ.35 కోట్లతో స్కై వే నిర్మిస్తుండగా రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, ఎల్​బీనగర్​ రూట్లను కలుపుతుంది. ఏ రూట్​నుంచైనా జనాలు రోడ్డు దాటేందుకు వీలుగా నిర్మిస్తున్నారు. ముందుగా ఇదే అందుబాటులోకి రానుంది. మెహిదీపట్నంలో రూ. 25 కోట్లతో చేపట్టనున్న స్కై వాక్ వే కు భూ సేకరణ ఇబ్బందులతో ఆలస్యం జరిగింది. ఇటీవల చిక్కులు తొలగిపోవడంతో త్వరలో పనులు మొదలవుతాయని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని హెచ్​ఎండీఏ అధికారులు చెప్పారు. స్కై వేలతో మెయిన్​రోడ్లలో వాహన ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. 

50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు
వాహనాలు,  జనాల రద్దీ కారణంగా రోడ్డు క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేప్పుడు చాలామంది ప్రమాదాల బారిన పడుతున్నారు. దీన్ని నివారించేందుకు స్కై వాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తున్నారు.  గతంలోనే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సిటీలో 50 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. తొలుత ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఎల్​బీ నగర్, ఐటీ కారిడార్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఏరియాల్లో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఆయా జంక్షన్ల వద్ద జనాలు ఈజీగా రోడ్డు దాటొచ్చు. 

అండర్ గ్రౌండ్ వేకు బదులుగా.. 
జంక్షన్లలో జనాలు రోడ్డు దాటేవిధంగా, మెయిన్​ రోడ్లపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా స్కై వాక్ వేలకు  హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. అండర్ గ్రౌండ్ వేకు బదులుగా ఎత్తైన స్కైవేలను నిర్మిస్తోంది.  వీటి పక్కన షాపింగ్ చేసుకునేలా కమర్షియల్ స్టాల్స్ ను  కూడా నిర్మిస్తున్నారు. సీనియర్ సిటిజన్లు కూడా ఎక్కి దిగేలా లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెట్లతోపాటు షాపింగ్​కు వీలుగా స్టాల్స్, కియోస్కీలతో నిర్మిస్తున్నారు.