ఆస్ట్రియన్ మోడల్‌‌ లో ఎస్‌‌ఎల్‌‌ బీసీ పనులు..టెన్నెల్‌‌ లో రాతి పరిస్థితులను అంచనా వేస్తూ బ్లాస్టింగ్

ఆస్ట్రియన్ మోడల్‌‌ లో ఎస్‌‌ఎల్‌‌ బీసీ పనులు..టెన్నెల్‌‌ లో రాతి పరిస్థితులను అంచనా వేస్తూ బ్లాస్టింగ్
  • బలహీనంగా ఉన్న చోట కాంక్రీట్‌‌తో లైనింగ్ చేస్తూ పనులు కొనసాగింపు
  • మరో ఐదు మీటర్ల మేర బ్లాస్టింగ్ చేసిన అధికారులు

హైదరాబాద్, వెలుగు:  ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్ పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. మూడ్రోజుల కింద డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు ప్రారంభించిన అధికారులు.. దానిని కొనసాగిస్తున్నారు. తాజాగా మరో ఐదు మీటర్ల మేర టన్నెల్ బ్లాస్టింగ్ పనులు చేశారు. మొత్తంగా ఈ మూడు రోజుల్లో 8 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం అధికారులు అత్యాధునిక పద్ధతులను పాటిస్తున్నారు. ఏడాది కింద జరిగిన ప్రమాదం లాంటిది మళ్లీ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందులో భాగంగా వివిధ దేశాల్లో పాటిస్తున్న ‘న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌‌ఏటీఎం)’టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. టన్నెల్ ప్రాంతంలో ఉన్న రాతి పరిస్థితులను బట్టి బ్లాస్టింగ్‌‌ను చేపడుతున్నారు. టన్నెల్‌‌పై భాగంతో పాటు గ్రౌండ్ స్ట్రెంత్‌‌ను స్థిరీకరిస్తూ.. అవసరమున్నచోట షాట్ క్రీటింగ్ పద్ధతిలో కాంక్రీట్‌‌తో ప్లాస్టింగ్ చేస్తూ పనులు చేస్తున్నారు. 

ఏంటీ ఎన్‌‌ఏటీఎం మెథడ్?

టన్నెల్ తవ్వేటప్పుడు కొన్నిచోట్ల ఎలాంటి పరిస్థితులుంటాయో అంచనా వేయడం కష్టం అవుతుంటుంది. కొన్నిచోట్ల గట్టి రాయి ఉంటే.. ఇంకొన్ని చోట్ల లూజ్ రాక్/బలహీనమైన రాతి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రమాదాలకు ఎక్కువ చాన్స్‌‌ ఉంటుంది. గ్రావెల్‌‌తో కూడిన బలహీనమైన రాతి నిర్మాణాలు ఉండడం.. దాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే నిరుడు ఫిబ్రవరిలో ప్రమాదం జరిగింది. దీంతో 8 మంది టన్నెల్‌‌లోనే చిక్కుకొని చనిపోయారు. దాని చుట్టూ 50 నుంచి వంద మీటర్ల వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు.. ప్రభుత్వం ఈ ఎన్‌‌ఏటీఎం అనే అడ్వాన్స్‌‌డ్‌‌ టన్నెలింగ్‌‌పై దృష్టి సారించినట్టు చెబుతున్నారు.

ఇందులో భాగంగా టన్నెల్‌‌ను బ్లాస్ట్ చేయగానే ఆ ప్రాంతం మరింత వీక్ కాకుండా.. కిందికి పడిపోకుండా ‘షాట్ క్రీటింగ్’ద్వారా కాంక్రీట్ మిక్చర్‌‌‌‌తో అక్కడ ప్లాస్టింగ్ చేస్తారు. బ్లాస్ట్ చేసినప్పుడు అక్కడ రాతి డీఫార్మేషన్‌‌నూ క్షుణ్నంగా పరిశీలిస్తారు. ఒకవేళ అక్కడ బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తే.. అదనపు రక్షణ చర్యలు తీసుకుంటారు. ఇక, ప్లాస్టింగ్ చేశాక.. దానిపై రాక్‌‌​బోల్ట్స్ లేదా వైర్ మెష్ లేదా స్టీల్ రిబ్స్ వంటి వాటితో టన్నెల్‌‌ను పటిష్టం చేస్తారు. బ్లాస్టింగ్ చేసినప్పుడు వ్యర్థాలు అధిక వేగంతో కింద పడిపోతుంటాయి. అలాంటి సందర్భాల్లో గ్రౌండ్ బలహీనపడకుండా చూసుకుంటూ.. అవసరమైన చోట కాంక్రీట్‌‌తో రీఇన్‌‌ఫోర్స్ చేస్తారని చెబుతున్నారు.