- 2028 జూన్ నాటికి 30 టీఎంసీల నీళ్లు అందిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు షియర్ జోన్ దాటి వేగంగా ముందుకు సాగుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2028 మే లేదా జూన్ నాటికి టన్నెల్-1 బ్రేక్‌త్రూ పూర్తి చేసి నల్గొండ జిల్లాకు 30 టీఎంసీల నీళ్లు అందిస్తామని చెప్పారు. ఆదివారం సెక్రటేరియెట్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎస్‌ఎల్‌బీసీతో పాటు పెండింగ్ ప్రాజెక్టులపై మంత్రి రివ్యూ చేశారు.
ఐదు నెలల్లో 700 మీటర్ల తవ్వకం..
టన్నెల్‌లో 20 కిలోమీటర్లకుపైగా లోపల ఇంజినీర్లు, కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. గత ఐదారు నెలల్లో కష్టమైన పరిస్థితులను అధిగమించి 700 మీటర్ల మేర తవ్వకం పూర్తయిందని అధికారులు మంత్రి వివరించారు. ఔట్‌లెట్ వైపు 450 మీటర్లు, ఇన్‌లెట్ వైపు 250 మీటర్లు తవ్వామన్నారు. 43.968 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్‌లో ఇప్పటికే 79 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. ఇంకా 9.1 కిలోమీటర్ల తవ్వకం మాత్రమే మిగిలిందని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
పనుల వేగంతో పాటు టన్నెల్‌లో పనిచేస్తున్న సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. తవ్వకంతోపాటు స్ప్రేయిడ్ కాంక్రీట్ లైనింగ్ పనులు కూడా సమాంతరంగా పూర్తి చేయాలన్నారు. టన్నెల్-2లో నిలిచిపోయిన లైనింగ్ పనులను తిరిగి ప్రారంభించినందున వాటిని త్వరగా పూర్తి చేయాలని, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ఒక్క పని పెండింగ్‌లో ఉండి నీటి విడుదలకు అడ్డంకి కాకూడదన్నారు.
రోజుకు 8 నుంచి 10 మీటర్ల తవ్వకం..
టీబీఎం మొరాయించిన ప్రాంతం చుట్టూ పనులు చేపడుతున్నప్పుడు బలహీనమైన నేల, రాళ్లు విరిగిపడటం వంటి సమస్యలు ఎదురయ్యాయని టన్నెల్ సెక్రటరీ పరీక్షిత్ మెహ్రా వివరించారు. అందుకే తొలుత తవ్వకాలను నెమ్మదిగా చేపట్టినట్లు తెలిపారు. ప్రమాదకర ప్రాంతంలో 140 ఎంఎం సీమ్‌లెస్ పైపులతో ‘అంబ్రెల్లా కనోపీ’ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టామన్నారు. రీఇన్‌ఫోర్స్డ్ రిబ్స్, విడతలవారీ తవ్వకం, ప్రోబ్ డ్రిల్లింగ్‌తో ప్రమాదాలను నివారిస్తున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం రోజుకు 7 నుంచి 7.5 మీటర్ల వరకు తవ్వకం జరుగుతోందని, త్వరలో 8 నుంచి 10 మీటర్లకు పెంచుతామని తెలిపారు. తవ్విన మట్టి, రాళ్లను 21 కిలోమీటర్ల దూరం బయటకు తరలించడం పెద్ద సమస్యగా ఉందన్నారు. దీనికోసం జర్మనీ నుంచి తెప్పిస్తున్న లోకోమోటివ్ ఇంజన్ అక్టోబర్ చివరి నాటికి సైట్‌కు చేరుతుందని చెప్పారు. ఔట్‌లెట్ వైపు త్రీ-ఆర్మ్ డ్రిల్లింగ్ బూమర్ ఇప్పటికే పనిచేస్తుండగా, ఇన్‌లెట్ వైపు మరో బూమర్ ఈ నెలలో అందుబాటులోకి వస్తుందన్నారు.
ఎలక్ట్రిక్ లోడర్లు, అడ్వాన్స్‌డ్ ఎక్స్‌కవేటర్లు కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. గతంలో 48 గంటలు పట్టిన నిర్మాణ సైకిల్ ఇప్పుడు 20 నుంచి 24 గంటలకు తగ్గిందని, కొత్త యంత్రాలు, లోకోమోటివ్ అందుబాటులోకి వస్తే 10 గంటలకు తగ్గించే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ చివరి లేదా నవంబర్ నుంచి పనులు మరింత స్పీడప్ అవుతాయని అధికారులు తెలిపారు.
రివ్యూలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మందుల సామేలు, కె. జైవీర్ రెడ్డి, వేముల వీరేశం, అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, ఈఎన్సీ రమేశ్ బాబుతో పాటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
