
జీడిమెట్ల, వెలుగు: సిటీలో రోడ్డుపై ఏ చిన్న ప్రమాదం జరిగినా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. అందుకు బుధవారం జరిగిన ఈ రెండు ఘటనలే నిదర్శనం. జీడిమెట్ల పరిధిలోని చింతల్ వద్ద బుధవారం సాయంత్రం అధిక లోడుతో ఇనుప చువ్వలు తీసుకెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.
ఇనుప చువ్వలు ముందు వెళ్తున్న కారుపై పడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనతో నర్సాపూర్ మెయిన్ రోడ్‌పై రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించి, అంబులెన్స్ లు సైతం ఇందులో చిక్కుకున్నాయి. ఆఫీసు నుంచి వచ్చే వారు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదకరంగా లోడు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
మొరాయించిన బస్సు.. గంట ట్రాఫిక్
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ లో ఓ ప్రైవేటు బస్సు మొరాయించడంతో భారీగా ట్రాఫిక్జామ్అయ్యింది. ఓ కంపెనీకి చెందిన మినీ ప్రైవేట్ బస్సు ఉద్యోగులను తీసుకుని వెళ్తుండగా, బుధవారం ఉదయం 9 గంటలకు రోడ్ నంబర్ 45కు రాగానే ట్రబుల్ ఇచ్చింది. కదలడానికి వీలు లేకుండా అక్కడే నిలిచిపోవడంతో గంటకు పైగా రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది రంగప్రవేశం చేసి స్పాట్లో బస్సును రిపేర్ చేయించి పంపించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.