గురుకుల విద్యార్థులకు స్మార్ట్​ కార్డులు.. అధికారులతో సీఎస్ రామకృష్ణారావు రివ్యూ మీటింగ్

గురుకుల విద్యార్థులకు స్మార్ట్​ కార్డులు.. అధికారులతో సీఎస్ రామకృష్ణారావు రివ్యూ మీటింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో మెరుగైన సేవలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎస్​ రామకృష్ణా రావు ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఆయన మంగళవారం సెక్రటేయెట్ లో సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. కాస్మోటిక్ ర్జీలను నేరుగా విద్యార్థుల బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు.

డెబిట్ కార్డు తరహాలో ఒక స్మార్ట్ కార్డును అందించిడం వల్ల విద్యార్థులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో నాణ్యమైన భోజనం, చక్కటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. విద్యార్థులు వారికి కావాల్సిన సబ్బులు, కాస్మోటిక్ వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి మహిళా సంఘాలు నిర్వహిస్తున్న మొబైల్ విక్రయ కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వచ్చేవిద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా నాణ్యమైన సరుకులు, విద్యార్థుల టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, బెడ్ షీట్లు, కార్పెట్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర సామగ్రి సమకూర్చుకునేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.