- గ్రేటర్లో 3,200 బస్సులు.. ఆధార్‌తో 2 లక్షల మంది ఫ్రీ ట్రావెల్
- ఫేక్ ఆధార్ కార్డులతో నష్టాన్ని నివారించేందుకే కొత్త విధానం
- ఇతర రాష్ట్రాల మహిళలకు అడ్డుకట్ట వేసేందుకు చాన్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం చేసే మహిళలకు త్వరలో స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఫేక్ ఆధార్ కార్డులను, ఇతర రాష్ట్రాల మహిళలను కట్టడి చేసేందుకే చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మొదటి పథకంగా మహాలక్ష్మిని అమలు చేసింది. ఈ స్కీంకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. రోజూ లక్షలాది మంది ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు.
ఆక్యుపెన్సీ రేషియో కూడా 90 శాతానికి పెరిగింది. మొదట్లో ఆర్డినరీ బస్సులకే వర్తింపచేసిన అధికారులు తర్వాత మెట్రోఎక్స్ప్రెస్లలోనూ మహాలక్ష్మిని వర్తింపచేయడంతో మరింత ఆదరణ పెరిగింది. అయితే గ్రేటర్ పరిధిలో తెలంగాణ మహిళలే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఫేక్ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మహాలక్ష్మి పథకం అర్హులకే అందాలన్న లక్ష్యంతో అధికారులు త్వరలోనే స్మార్ట్‌కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు.
ఈ కార్డుల జారీలో అధికారులు సదరు వ్యక్తుల ఆధార్‌కార్డులను క్షుణ్ణంగా పరిశీలించి కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. అంతే కాకుండా ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లడానికి కూడా కొన్ని సార్లు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్‌కార్డు జారీ చేస్తే సులభంగా ఉంటుందని కూడా అధికారులు భావిస్తున్నారు.
25 వేల ఫేక్ ఆధార్ కార్డులు
ప్రస్తుతం గ్రేటర్‌పరిధిలో 3,200 బస్సులను నడుపుతుండగా, ఇందులో 2 వేల వరకు ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ ఈ బస్సుల్లో దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తుండగా ఇందులో దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇందులో దాదాపు 25 నుంచి 30 వేల మంది వరకు ఫేక్ఆధార్కార్డులతో ప్రయాణం చేస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. ఇలాంటి ప్రయాణాల వల్ల సర్కారుకు నష్టం వాటిల్లుతుండడంతో స్మార్ట్‌కార్డులను తీసుకువస్తున్నారు.
స్మార్ట్ కార్డు ఎలా పని చేస్తుందంటే..
స్మార్ట్ కార్డులను చిప్ బేస్డ్ టెక్నాలజీతో తయారు చేస్తారని అధికారులు తెలిపారు. కార్డులోని చిప్ లో లబ్ధిదారుల పేర్లు, అడ్రస్, వాళ్లకు కేటాయించిన ఐడీ నెంబర్‌ను నిక్షిప్తం చేస్తారు. ప్రస్తుతం బస్సుల్లో కండక్టర్లకు ఆధార్‌కార్డు చూపిస్తే టికెట్ఇస్తున్నారు.
కానీ, కార్డులను జారీ చేసిన తర్వాత లబ్ధిదారులకు ఇచ్చిన స్మార్ట్‌కార్డును కండక్టర్వద్ద ఉండే టికెట్ఇష్యూయింగ్మెషీన్(టిమ్)తో స్వైప్ చేస్తారు. దీంతో టికెట్ బిల్లు జనరేట్ అవుతుంది. అయితే, స్మార్ట్ కార్డు జారీకి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందన్న విషయంపై ఇంకా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.
