సీరియల్ చైన్ స్నాచింగ్స్​ కేసు.. పది రోజులైనా దొరకని దొంగలు

సీరియల్ చైన్ స్నాచింగ్స్​ కేసు.. పది రోజులైనా దొరకని దొంగలు

 హైదరాబాద్‌‌, వెలుగు: సీరియల్‌‌ చైన్‌‌ స్నాచింగ్స్ కేసులో స్నాచర్లు పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. మెట్రో సిటీస్‌‌లో షెల్టర్‌‌ ‌‌తీసుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో పది రోజులు గడుస్తున్నప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.ఈ నెల 7న ఉప్పల్‌‌, నాచారం, సికింద్రాబాద్‌‌లో  వరుసగా ఏడు చైన్ స్నాచింగ్స్‌‌ జరిగిన సంగతి తెలిసిందే. వృద్ధులనే టార్గెట్‌‌ చేసి 24 తులాల బంగారు గొలుసు
లను తెంపుకెళ్లారు. చోరీ చేసిన బైక్‌‌పై సిటీలో చక్కర్లు కొట్టారు. సీసీటీవీ కెమెరాలు క్యాప్చర్ చేస్తాయని తెలిసినా లైట్‌‌ తీసుకున్నారు. పోలీసులకు మస్కా కొట్టి ఎస్కేప్‌‌ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌‌,రాచకొండ పోలీసులు జాయింట్‌‌ ఆపరేషన్‌‌ చేస్తున్నారు.

ఢిల్లీ, ముంబయిలో గాలింపు..

ఢిల్లీ, ముంబయిలో స్నాచర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. చోరీలు చేసిన విధానం పరిశీలించి యూపీ శామ్లీ గ్యాంగ్‌‌గా అనుమానిస్తున్నారు. కానీ ఇందులోనూ స్పష్టమైన ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. దీంతో పాతనేరస్తుల డేటాతో యూపీ, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్రలో గాలిస్తున్నారు. ఓల్డ్‌‌ చైన్‌‌స్నాచర్స్‌‌ డేటా బేస్‌‌ ఆధారంగా సెర్చ్‌‌ చేస్తున్నారు. అయినప్పటికీ స్నాచర్ల జాడను కనిపెట్టలేకపోతున్నారు. ఇందుకు కారణం ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌‌ మినహా ఇతర ఆధారాలు పోలీసుల దగ్గర లేకపోవడమేనని తెలుస్తోంది. స్నాచర్లు చోరీలకు వాడిన బైక్‌‌ను కూడా ప్యారడైజ్‌‌ దగ్గర వదిలివేసి ఎస్కేప్‌‌ అయ్యారు. చైన్‌‌స్నాచింగ్స్ అనంతరం బస్సులు,ఆటోల్లో జర్నీ చేశారు. కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్స్, ఎంజీబీఎస్‌‌ బస్‌‌స్టేషన్లలో తిరిగారు. ఇలాంటి సీసీటీవీ ఫుటేజ్‌‌లు తప్ప పోలీసులకు ఇతర ఆధారాలు దొరకలేదు. దీంతో ఇన్వెస్టిగేషన్‌‌కు బ్రేకులు పడుతున్నాయి.

 ఇన్వెస్టిగేషన్లను స్టడీ చేసిన స్నాచర్లు!

టెక్నాలజీతో  కేసులు ఛేదిస్తున్నామని పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ కేసులో మాత్రం స్నాచర్లు సవాళ్లు విసురుతున్నారు. ఇందుకు కారణం స్నాచర్లు, ప్రాపర్టీ దొంగలు పాతనేరస్తులు కావడమే. ఇప్పటికే మెట్రో సిటీస్‌‌లో వరుస చోరీలు చేశారు.ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల పోలీస్‌‌ ఇన్వెస్టిగేషన్లను స్నాచర్లు స్టడీ చేసినట్లు తెలుస్తోంది. పాతకేసుల్లో వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విధానాలను పరిశీలించారు. జైళ్లలోని పాత నేరస్తులతో కలిసి మెళకువలు నేర్చుకున్నారు.ఎస్కేపింగ్‌‌ స్కిల్స్‌‌ పెంచుకున్నారు. సెల్‌‌ఫోన్లు వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇలాంటి కేసుల్లో పోలీస్‌‌లు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారనే వివరాలు తెలుసుకున్నారు. నేరం చేసిన తరువాత ఎలా తప్పించుకోవాలి, ఎక్కడ షెల్టర్‌‌‌‌ తీసుకోవాలో స్నాచర్లు పక్కా ప్లాన్‌‌ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బైరామల్​గూడలో..

వరుస చైన్ స్నాచింగ్స్ ఘటన జరిగిన ఐదు రోజులకే  గ్రేటర్ లో ఓ చోట స్నాచింగ్ జరగగా.. మరో దగ్గర చోరీకి యత్నించారు.  ఏపీలోని కర్నూల్ జిల్లా బిలకలగూడూర్ కు చెందిన గూడెం సోలయ్య(36) సిటీకి వచ్చి మూసారాంబాగ్ లో ఉంటూ డెలివరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 13న ఎల్ బీనగర్ పరిధి బైరామల్ గూడలో శానిటేషన్ వర్కర్ గా పనిచేసే మహిళ మెడలో నుంచి బంగారాన్ని కొట్టేయగా.. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేశారు. ఈ నెల 14న  దమ్మాయిగూడలోని మారుతీనగర్ కి చెందిన పుష్ప అనే మహిళ కిరాణా షాప్ కు వెళ్తుండగా.. యాక్టివాపై వచ్చిన ఓ మైనర్ ఆమె మెడలోని బంగారాన్ని లాక్కెళ్లుందుకు యత్నించాడు. బాధితురాలి కంప్లయింట్ తో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన జవహర్ నగర్ పోలీసులు 2 గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  చైన్ స్నాచింగ్ కు పాల్పడే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు.  ఈ నెల 13న బైరామల్ గూడలో జరిగిన కేసును ఛేదించామని..దమ్మాయిగూడలో జరిగిన ఘటనలోనూ మైనర్ ను అదుపులోకి తీసుకుని హోంకు తరలించామని ఆయన చెప్పారు. నంబర్ ప్లేట్ సరిగా లేని బైక్ లపై తిరిగిన వారిపై కేసు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. 

కో ఆర్డినేషన్ ఏదీ?

స్నాచర్లను పట్టుకోకపోవడంలో పోలీసుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు గంటల వ్యవధిలో జరిగిన వరుస చోరీలతో సకాలంలో స్పందిస్తే ఫలితం ఉండేది. ఇందులో మొదటి స్నాచింగ్‌‌ జరిగిన తర్వాత ఉప్పల్‌‌ పీఎస్ పోలీసులు ఆలస్యంగా స్పందించినట్లు తెలిసింది.6.05 గంటలకు వృద్ధురాలి మెడలోని పుస్తెలతాడును స్నాచర్లు తెంపుకెళ్లగా.. వెంటనే స్థానికులు డయల్ 100కి సమాచారం ఇచ్చారు. సుమారు  10 నిమిషాల తర్వాత పోలీసులు స్పాట్‌‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. అదే  టైమ్​లో మిగతా పీఎస్‌‌ల పోలీసులను అలర్ట్ చేస్తే తర్వాత వరుస స్నాచింగ్స్‌‌ జరగకుండా అడ్డుకునే అవకాశం ఉండేది. ఈ క్రమంలోనే 8.10 గంటలకు చివరి స్నాచింగ్‌‌ చేసి దొంగలు ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత మూడు కమిషనరేట్ల పోలీసులు అలర్ట్‌‌ అయ్యారు. ఈ ఘటన తర్వాత నుంచి  కాలనీల్లో పోలీసులు పెట్రోలింగ్, వెహికల్‌‌ చెకింగ్‌‌ చేస్తున్నారు.