- 30 ఏండ్ల నాటి బోస్నియా వార్‌లో ‘స్నైపర్ టూరిజం’
- ఆ దారుణాలు తాజాగా వెలుగులోకి
- సెర్బ్ దళాలకు రూ. కోటి చొప్పున చెల్లించిన ఒక్కో ధనికుడు
- ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మిలియనీర్ల ఆటవిక క్రీడ
సరాజెవో(బోస్నియా): బోస్నియాలో 30 ఏండ్ల కిందట జరిగిన నరమేధం తాజాగా బయటపడింది. బోస్నియా రాజధాని సరాజెవో నగరాన్ని ఆక్రమించేందుకు బోస్నియాలోని సెర్బ్ దళాలు యుద్ధం ప్రకటించాయి. అయితే, ఆ యుద్ధం మాటున ఇటలీలోని మిలాన్‌కి చెందిన కొందరు సంపన్నులు తమ సరదా కోసం సరాజెవోలోని అమాయక ప్రజలను వేటాడి కాల్చి చంపారు. స్నైపర్ టూరిజం(కొండల మీద నుంచి కాల్పులు జరపటం)పేరిట హ్యూమన్ సఫారీ చేశారు.
ఇందుకోసం ఒక్కొక్క ధనికుడు సెర్బ్ దళాలకు లక్ష యూరోలు (సుమారు రూ. 1 కోటి) చెల్లించారు. 30 ఏండ్లనాటి ఈ భయంకర రహస్యం ఇప్పుడు బయటపడింది. దీనిపై ఇటలీలోని మిలన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. నరమేధానికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేసింది.
ఏం జరిగిందంటే..!
యుగోస్లేవియా అనే పెద్ద దేశంలో 6 చిన్న రిపబ్లిక్‌లు ఉండేవి. వాటిలో బోస్నియా-–హెర్జెగోవినా కూడా ఒకటి. అందులో బోస్నియాక్‌లు (ముస్లింలు) 44%, సెర్బ్‌లు (ఆర్థడాక్స్ క్రైస్తవులు) 31%, క్రొయేట్‌లు (కాథలిక్ క్రైస్తవులు) 17% తదితరులు నివసించేవారు. అయితే, యుగోస్లేవియా దేశం 1991–92లో ముక్కలైంది. బోస్నియా ప్రజలు 1992లో రిఫరెండం (ఓటింగ్) నిర్వహించి బోస్నియా-–హెర్జెగోవినాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు.
బోస్నియాలో ఉన్న సెర్బ్‌లు(ఆర్థడాక్స్ క్రైస్తవులు) దీన్ని ఒప్పుకోలేదు. తాము సెర్బియాతో కలిసి ఉంటామని స్పష్టం చేశారు. అంతేగాకుండా బోస్నియాక్‌లు, క్రొయేట్‌లపై సెర్బ్ దళాలు దాడులు చేశాయి. దాంతో1992 ఏప్రిల్‌లో బోస్నియా- యుద్ధం మొదలైంది. ఇది 1992–95 వరకు కొనసాగింది.
సరదా కోసం మనుషుల వేట..
యుద్ధ టైంలో ధనవంతులైన విదేశీయులు.. ముఖ్యంగా ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌కు చెందినవారు సరాజెవోలో స్నైపర్ టూరిజానికి పాల్పడ్డారు. సరదాగా ప్రజలను కాల్చి చంపడానికి సర్బ్ స్నైపర్ల (దూరం నుంచి షూట్ చేసే సైనికులు)కు ఒక్కొక్క ధనికుడు లక్ష యూరోలు (సుమారు రూ. 1 కోటి) చెల్లించాడు.
ఆ తర్వాత ఈ ధనికులు.. సెర్బ్ దళాల సాయంతో సరాజెవో చుట్టూ ఉన్న కొండలపైకి వెళ్లి గన్‌లతో సివిలియన్‌లను కాల్చి చంపారు. ఇలా యుద్ధం కాస్త హ్యూమన్ సఫారీ(మనుషుల వేట)లా మారిపోయింది. ధనికుల సరదా కోసం సాగిన ఈ వేటలో లక్ష మందికి పైగా చనిపోయారు. మరో20 లక్షల మంది ఇండ్లు ఖాళీ చేసి పారిపోయారు.
ఎలా బయటపడిందంటే..
ఈ దారుణాన్ని 1994–95లోనే ఇటలీ మీడియా బయట పెట్టినా.. ఆ టైంలో ఆధారాలు లేక ఎవరూ నమ్మలేదు. మళ్లీ ఇప్పుడు 30 ఏండ్ల తర్వాత ఇటాలియన్ జర్నలిస్ట్ ఎజియో గవాజెని రిపోర్టుతో నిజం బయటపడింది. 1994–95నాటి ఇటాలియన్ పత్రికలు, 2022లో వచ్చిన “సరాజెవో సఫారీ” సినిమా చూసి అతడు ఆధారాలు సేకరించాడు.
ఇతర పలు రిపోర్టులు కూడా కలిపి ఈ కేసులో ఒక పెద్ద ఫైల్ తయారు చేశాడు.2 025లో మిలన్ (ఇటలీ) ప్రాసిక్యూటర్ కార్యాలయంలో కంప్లైంట్ చేశాడు. అమాయకులను చంపిన ఇటాలియన్ ధనికులపై “వాలంటరీ మర్డర్” కేసు పెట్టాలని కోరాడు. దీంతో మిలన్ ప్రాసిక్యూటర్ అలెసాండ్రో గోబ్బి ఇటీవల అధికారికంగా దర్యాప్తు మొదలుపెట్టారు.
