తగ్గిన తుఫాన్.. రోడ్లు ఓపెన్

తగ్గిన తుఫాన్.. రోడ్లు ఓపెన్

న్యూయార్క్: అమెరికాలో మంచు తుఫాన్ తగ్గింది. మంచులో కూరుకుపోయిన న్యూయార్క్ లోని బఫెలో సిటీ కోలుకుంటోంది. మంచు తుఫాన్ తగ్గడంతో అధికారులు సిటీలో డ్రైవింగ్ బ్యాన్ ఎత్తివేశారు. రోడ్లు రీఓపెన్ చేశారు. కాలనీల్లో పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు. కరెంట్, వాటర్ సప్లై కట్ అయిన ప్రాంతాల్లో రిపేర్లు చేస్తున్నారు. టెంపరేచర్ మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో వాటర్ పైపులైన్లలో నీళ్లు గడ్డకట్టుకుపోయాయి.

‘‘సిటీలోని మేజర్ హైవేలు, రోడ్లపై చాలా వరకు మంచు తొలగించాం. నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును రీఓపెన్ చేశాం” అని బఫెలో సిటీ మేయర్ బైరాన్ బ్రౌన్ తెలిపారు. డ్రైవింగ్ బ్యాన్ ఎత్తివేసినప్పటికీ.. ప్రజలు అవసరం ఉంటే తప్ప, తమ వెహికల్స్ లో బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, టెంపరేచర్లు క్రమంగా పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో మంచు అంతా కరిగి వరదలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. దీనికి తోడు వర్షాలు కూడా పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

కొంతమంది మిస్సింగ్... 

ఎప్పుడూ లేని విధంగా బఫెలో సిటీలో ఈసారి 50 ఇంచుల మేర మంచు కురిసింది. రోడ్లు, వాహనాలను మంచు పూర్తిగా కప్పేసింది. క్రిస్మస్ వేళ బయటకు వెళ్లిన చాలా మంది తమ వెహికల్స్​లో మంచు కింద చిక్కుకుపోయారు. సాయానికి వెళ్లిన ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా మంచులో చిక్కుకున్నాయి. ఒక్క బఫెలో సిటీలోనే 29 మంది చనిపోయారు. ఇంకా కొంతమంది ఆచూకీ దొరకలేదు. మిస్సయిన వాళ్ల కోసం రెస్క్యూ సిబ్బంది వెతుకుతున్నారు. నేషనల్ గార్డు స్టాఫ్ ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు.