కాంగ్రెస్‌‌ తోనే సామాజిక న్యాయం.. మా ప్రభుత్వంలోనే బలహీన వర్గాలు అభివృద్ది చెందారు

కాంగ్రెస్‌‌ తోనే సామాజిక న్యాయం.. మా ప్రభుత్వంలోనే బలహీన వర్గాలు అభివృద్ది చెందారు
  • మంత్రి పొన్నం ప్రభాకర్‌‌

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్‌‌ పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే బలహీనవర్గాల అభివృద్ధి జరిగిందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌‌ జిల్లా స్థాయిలో మూడు రోజుల పాటు జరగనున్న కాంగ్రెస్‌‌ పార్టీ ఆదివాసీ శిక్షణ తరగతులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌తో కలిసి బుధవారం కరీంనగర్ డీసీసీ భవన్‌‌లో ప్రారంభించారు. 

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌‌ మాట్లాడుతూ.. చదువుతోనే భవిష్యత్‌‌ బాగుటుందని, కుటుంబాల్లో వెలుగు నింపుతుందని.. గిరిజన శిక్షణ కార్యక్రమంలో చదువు అవసరాన్ని ప్రధానంగా చర్చించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌ మాట్లాడుతూ... కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో తొలిసారిగా ట్రైబల్‌‌ అడ్వైజరీ కమిటీ మీటింగ్‌‌ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. 

బీఆర్ఎస్‌‌ పాలనలో ఆదివాసీలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రూ.740 కోట్ల వెచ్చించినట్లు చెప్పారు. అంతకుముందు సేవాలాల్‌‌ మహారాజ్‌‌, అంబేద్కర్‌‌ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కార్యక్రమంలో సుడా చైర్మన్‌‌ కోమటిరెడ్డి నరేందర్‌‌రెడ్డి, కాంగ్రెస్‌‌ ఎస్టీ సెల్‌‌ సమన్వయకర్త కోట్యా నాయక్, కాంగ్రెస్‌‌ పార్లమెంట్‌‌ ఇన్‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌రావు, కాంగ్రెస్‌‌ ఆదివాసీ సెల్‌‌ చైర్మన్‌‌ బానోతు శ్రవణ్‌‌నాయక్‌‌, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ పాల్గొన్నారు.

గౌరవెల్లిని త్వరగా పూర్తి చేస్తాం

హుస్నాబాద్/అక్కన్నపేట, వెలుగు : గౌరవెల్లి ప్రాజెక్ట్‌‌ను త్వరగా పూర్తి చేస్తామని, కాల్వల నిర్మాణానికి సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ అన్నారు. బుధవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ఎంపీడీవో ఆఫీస్‌‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... ఎంపీడీవో ఆఫీస్‌‌ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌కు కూడా సొంత బిల్డింగ్‌‌ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 సిద్దిపేట కలెక్టర్‌‌ హైమావతి, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ గరిమా అగర్వాల్‌‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ లింగమూర్తి, హుస్నాబాద్‌‌ మార్కెట్‌‌ కమిటీ చైర్మన్‌‌ తిరుపతిరెడ్డి, ఎంపీడీవో జయరాం, సింగిల్‌‌ విండో చైర్మన్‌‌ శివయ్య పాల్గొన్నారు.