ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది?..జైల్లో హత్యకు గురయ్యారా?.. సోషల్ మీడియాలో డెడ్ బాడీ ఫోటోస్ వైరల్

ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది?..జైల్లో హత్యకు గురయ్యారా?.. సోషల్ మీడియాలో డెడ్ బాడీ ఫోటోస్ వైరల్
  • జైల్లో హత్యకు గురైనట్లు అఫ్గాన్ రక్షణ శాఖ ప్రకటన
  • టార్చర్ చేసి చంపేశారంటున్న బలూచిస్తాన్ విదేశాంగ శాఖ
  • సోషల్ మీడియాలో ఇమ్రాన్ డెడ్​బాడీ ఫొటోలు వైరల్!
  • అడియాలా జైలు ఎదుట మాజీ ప్రధాని అక్కాచెల్లెళ్ల ధర్నా
  • తమ అన్నను చూపించాలని డిమాండ్
  • ఇమ్రాన్ చెల్లిని జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు
  • తీవ్రంగా ఖండించిన తెహ్రీక్‌‌‌‌ ఏ ఇన్సాఫ్‌‌‌‌
  • పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం

ఇస్లామాబాద్: అవినీతి కేసులో శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌‌ జైల్లో హత్యకు గురయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్‌‌ను జైలులో టార్చర్ పెట్టి చంపేశారని కథనాలు వెలువడుతున్నాయి. 

పాకిస్తాన్ చీఫ్‌‌ ఆఫ్‌‌ ఆర్మీ స్టాఫ్‌‌ అసీమ్‌‌ మునీర్‌‌, ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్‌‌ఐ కలిసి ఆయనను హతమార్చినట్టు బలూచిస్తాన్ విదేశాంగ శాఖ తమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇమ్రాన్​ఖాన్​ను జైల్లో హత్య చేశారంటూ అఫ్గాన్ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇంత జరిగినా.. అటు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇటు సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

పాకిస్తాన్‌‌లో జరిగే పరిణామాలపై ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ ఏదొక సందర్భంలో మాట్లాడుతూ ఉండేవారు. కానీ, ఇటీవల కాలంలో ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ నుంచి ఎలాంటి వీడియో లేదా ఆడియో కనీసం ఒక ప్రకటన కూడా రిలీజ్ కాలేదు. దీనికితోడు గత కొద్ది నెలలుగా ఇమ్రాన్ ఖాన్‌‌ కు సంబంధించిన వివరాలన్నీ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నది. ఆయన్ను కలవడానికి వీల్లేదంటూ కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్, రాజకీయ నాయకులపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 

3 వారాలుగా ఇమ్రాన్​ను కలిసేందుకు అతని అక్కాచెల్లెళ్లు ప్రయత్నిస్తున్నప్పటికీ.. జైలు సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. చివరికి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ సీఎంను కూడా ఇమ్రాన్​ను కలవనివ్వలేదు.

రోడ్లపైకొచ్చి పీటీఐ శ్రేణుల నిరసనలు

ఇమ్రాన్ ఖాన్ జైల్లో హత్యకు గురయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ముగ్గురు అక్కాచెల్లెళ్లు రావల్పిండిలోని అడియాలా జైలు ముందు మంగళవారం అర్ధరాత్రి ధర్నాకు దిగారు. తమ అన్న ఇమ్రాన్ ఖాన్ ఎక్కడని జైలు సిబ్బందిని నిలదీశారు. ఇమ్రాన్​ను చూపించాలని తెహ్రీక్‌‌ ఏ ఇన్సాఫ్‌‌ మద్దతుదారులు కూడా ఆందోళనలు చేపట్టారు. 

కుటుంబ సభ్యులు, పార్టీ మద్దతుదారుల ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అన్నను చూపించాలని కోరితే.. పోలీసులు, జైలు సిబ్బంది తమపై దాడి చేశారని నూరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ ఆరోపించారు. కాగా, మరోవైపు ఆయన అనారోగ్యంతోనూ చనిపోయి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కానీ, ఇప్పటి వరకు వీటిని ధ్రువీకరించేలా అధికారికంగా ఒక్క ఎవిడెన్స్ బయటకు రాలేదు. పాకిస్తాన్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఇదిలా ఉంటే, వరుస పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు.

2023 ఆగస్టు నుంచి జైల్లోనే..

అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్‌‌ ఖాన్‌‌ 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. 3 వారాల నుంచి పోలీసులు తమ అన్నను కలవనివ్వడం లేదని పంజాబ్ పోలీస్ చీఫ్ ఉస్మాన్ అన్వర్​కు రాసిన లేఖలో ఇమ్రాన్ సిస్టర్స్ పేర్కొన్నారు. ‘‘ఇమ్రాన్ ఖాన్​ను కలవడం నేరమని పోలీసులు చెప్తున్నారు. మా అన్నను చూపించాల ని కోరితే పోలీసులే మాపై దాడి చేశారు. 

ఈ ఘటనపై దర్యాప్తు చేయాలి. వెంటనే మా అన్నను చూపించాలి. ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండీషన్​పై ఆందోళన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నాకు 71 ఏండ్లు. నా జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మహిళలని చూడకుండా చెంప దెబ్బ కొడ్తూ తోసేశారు’’ అని ఇమ్రాన్ సోదరి నూరీన్ ఖాన్ పేర్కొన్నారు.