V6 News

ఫలితాలే మా పనితీరుకు నిదర్శనం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఫలితాలే మా పనితీరుకు నిదర్శనం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​హైదరాబాద్, వెలుగు: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు పదో తరగతి ఫలితాల్లో 99.12 శాతం ఉత్తీర్ణతతో చరిత్ర సృష్టించాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. గురువారం డి.ఎస్.ఎస్ భవన్‌‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 40 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యుత్తమ ఫలితాలు నమోదయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. పరీక్షలకు హాజరైన 17,071 మంది విద్యార్థులలో 16,921 మంది ఉత్తీర్ణత సాధించారని, మొత్తం 235 విద్యాసంస్థల్లో 163 పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించగా, 9 జిల్లాల్లోని అన్ని గురుకులాలు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో సైతం ఫస్టియర్‌‌‌‌లో 77.79%, సెకండియర్‌‌‌‌లో 88.22% ఉత్తీర్ణత నమోదైందని, జేఈఈ మెయిన్స్‌‌లో 441 మంది విద్యార్థులు అర్హత సాధించగా, అందులో 35 మంది 90 పర్సెంటైల్ కంటే ఎక్కువ మార్కులతో సత్తా చాటారని తెలిపారు.

ఒక్క విద్యార్థి కూడా వెనుకబడకూడదనే లక్ష్యంతో ప్రత్యేక ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, డిజిటల్ క్లాస్‌‌రూమ్‌‌లు, ఆధునిక ల్యాబ్‌‌లు అందుబాటులోకి తెచ్చామని మంత్రి వివరించారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలను పెంచి ప్రోటీన్ రిచ్ డైట్ అందిస్తున్నామని, పెండింగ్‌‌లో ఉన్న భవనాల అద్దెలు, డైట్ బిల్లులను మార్చి 31 నాటికే క్లియర్ చేసి పారదర్శకతను నిరూపించుకున్నామని చెప్పారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలోని 63 ప్రీమెట్రిక్ వసతి గృహాల్లో 95.11% ఉత్తీర్ణత నమోదైందని పేర్కొన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు విద్యార్థుల విజయాలే సమాధానమని, పేద విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.