- ఏటీఎం వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి మోసాలు
- ఫేక్ ట్రాన్సాక్షన్ మెసేజ్‌లు చూపించి బురిడీ
- 2018 నుంచి ఇప్పటివరకు 81 కేసులు
- ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్
బషీర్‌బాగ్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్‌లకు బానిసై, ఏటీఎంల వద్ద మోసాలకు పాల్పడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కోనసీమ జిల్లాకు చెందిన ఇంటిపల్లి రామారావు ఇంజినీరింగ్ పూర్తి చేసి గతంలో టెక్ మహీంద్రలో ఉద్యోగం చేసేవాడు.
ఆ సమయంలో బెట్టింగ్‌ల కోసం క్రెడిట్ కార్డులు విచ్చలవిడిగా వాడి అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చడానికి అడ్డదారులు తొక్కి.. ఏటీఎంల వద్ద డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చే అమాయకులను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఎస్బీఐ డిపాజిట్ మిషన్ల వద్దకు వచ్చే అమాయకులకు ‘క్యూ లైన్ ఎక్కువగా ఉంది, మీ డబ్బు నాకు ఇస్తే నేను నెఫ్ట్ (ఎన్ఈఎఫ్టీ) ద్వారా వెంటనే మీ అకౌంట్కు బదిలీ చేస్తాను’ అని నమ్మించేవాడు.
ఫేక్ మెసేజ్ చూపించి పరార్
ఈ నెల 22న కోఠి ఎస్బీఐ ఏటీఎం వద్ద ఓ మహిళ నుంచి ఇలాగే లక్ష రూపాయలు కాజేసి, ఫేక్ మెసేజ్ చూపించి పరారయ్యాడు. ఎంతసేపటికి డబ్బులు అకౌంట్లోకి రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ నెల 28న నారాయణగూడ ఫ్లైఓవర్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిపై 2018 నుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 81 కేసులు ఉన్నాయని, గతంలో జైలుకు వెళ్లి వచ్చినా పద్ధతి మార్చుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడుతున్నాడని డీసీపీ తెలిపారు. ఏటీఎంల వద్ద గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వవద్దని, యువత వ్యసనాలకు బానిస కావొద్దని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.

