కేపీహెచ్బీలో వేశ్యను బుక్ చేసుకోబోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి !

కేపీహెచ్బీలో వేశ్యను బుక్ చేసుకోబోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి !

హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీ అంటే ఫ్యామిలీస్ కి అనుకూలంగా, ప్రశాంతంగా ఉండే ఏరియా... దీంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఏపీ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిలైన వాళ్ళు ఎక్కువశాతం కేపీహెచ్బీలో ఉండటానికే ఇష్టపడేవారు ఇదంతా ఒకప్పుడు... ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎటు చూసినా హాస్టల్స్ తో, బ్యాచిలర్స్ తో మరో అమీర్ పేట్ లా తయారయ్యింది.

ఒకప్పుడు ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఛాయిస్ గా ఉన్న ఏరియా ఇప్పుడు నేరాలు పెరిగిపోతుండటంతో స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కేపీహెచ్బీలో తరచూ జరుగుతున్న హత్యలు, అసాంఘిక కార్యకలాపాలే ఇందుకు నిదర్శనం. మంగళవారం ( ఆగస్టు 19 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కేపీహెచ్బీలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయనటానికి నిదర్శనంగా నిలుస్తోంది. వేశ్యను బుక్ చేసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

మధు గౌడ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి రవళి అనే వేశ్యను బుక్ చేసుకునేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. రవళి తన మరిది సోహెల్ కి కాల్ చేసి చెప్పడంతో అతను తన అనుచరుడు చర్పట్ శశికి చెప్పగా.. శశి తన గ్యాంగ్ తో వచ్చి మధు గౌడ్ పై దాడికి పాల్పడ్డాడు. శశి గ్యాంగ్ కత్తితో దాడి చేయడంతో మధు గౌడ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సోహెల్, శశి, అతని గ్యాంగ్, రవళిని అదుపులోకి తీసుకున్నారు.

బాధితుడు మధు హిమాయత్ నగర్ కు చెందినవాడని.. అతని తండ్రి హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మధును హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు.

ఇదిలా ఉండగా.. కేపీహెచ్బీ లాంటి ఏరియాల్లో రాత్రి 10 దాటితే చాలు సెక్స్​వర్కర్లు రెచ్చిపోయేవారు. వేశ్యల ఆగడాలు మితిమీరిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ వేశ్యలను కట్టడి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ఘటనతో పాతరోజులు మళ్ళీ వచ్చాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు స్థానికులు.