హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. సేఫ్టీ క్లిప్ కూడా పెట్టుకోండి.. ఎంత ఘోరం జరిగిందో చూడండి !

హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు.. సేఫ్టీ క్లిప్ కూడా పెట్టుకోండి.. ఎంత ఘోరం జరిగిందో చూడండి !

బషీర్​బాగ్, వెలుగు: ఎలక్ట్రిక్​ బైక్​ ఫ్లైఓవర్​పై నుంచి పడిన ఘటనలో ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ మృతి చెందాడు. కాచిగూడ సీఐ జ్యోత్స్, ఎస్సై భరత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడకు చెందిన అశోక్ గుప్త  కుమారుడు శిరీష్(33) పుణేలో సాఫ్ట్​వేర్​ఇంజినీర్​గా చేస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి తన ఎలక్ట్రికల్ బైక్ పై గోల్నాక నుంచి రామంతాపూర్ లో ఉండే స్నేహితుడి వద్దకు వెళ్తున్నాడు. 

మార్గమధ్యలో అంబర్ పేట్ బ్రిడ్జి(ఛే నంబర్​ వద్ద)పై వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో శిరీష్​ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్​మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

హెల్మెట్ ఊడిపోవడంతో..
శిరీష్​ హెల్మెట్​కు సేఫ్టీ క్లిప్​పెట్టుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్​ బైక్ ​ఫ్లైఓవర్​ పైనుంచి కిందపడే సమయంలో అతని తలకు ఉన్న హెల్మెట్​ఊడిపోయిందన్నారు. శిరీష్​తల బలంగా రోడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడన్నారు. ద్విచక్రవాహనాలపై వెళ్లేవారు హెల్మెట్​తలకు తగిలించుకుంటే సరిపోదని తప్పకుండా సేఫ్టీ క్లిప్​పెట్టుకోవాలని సూచించారు. . 

గూడ్స్​ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పేట్​బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లికి చెందిన ఎన్.యాదగిరి(65) సోమవారం పెరుగు తెచ్చుకునేందుకు బయటకు వెళ్లాడు. 

మున్సిపల్ ఆఫీస్ సమీపంలో రోడ్డు దాటుతుండగా అయోధ్య క్రాస్​రోడ్డు నుంచి గుండ్లపోచంపల్లి వైపు వెళ్లే గూడ్స్​ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదగిరి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.