- ఓవర్ లోడ్, హై స్పీడ్ తో తరచూ యాక్సిడెంట్లు
- అదుపుతప్పి అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వెహికిల్స్
- లైట్ తీసుకుంటున్న ఆర్టీఏ, పోలీస్ ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు: జిల్లాలో మట్టి టిప్పర్లు మితిమీరిన వేగంతో అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. డ్రైవర్లు ఓవర్ లోడ్ తో హై స్పీడ్ లో వెళ్తుండటంతో అదుపు తప్పి జనాల మీదకు దూసుకెళ్తున్నాయి. డ్రైవర్ల అనుభవ లేమి, మద్యం మత్తు కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాల్సిన ఆర్టీఏ, పోలీస్ ఆఫీసర్లు లైట్ తీసుకుంటుండటం.. రాత్రీ, పగలు తేడా లేకుండా టిప్పర్లు దూసుకెళ్తుండటంతో రోడ్లెక్కాలంటేనే జనాలు జంకాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఓవర్ లోడ్.. ఆపై హై స్పీడ్
హనుమకొండ జిల్లా ఎన్ హెచ్-163, ఎన్హెచ్-563, ఎన్హెచ్ -765డీజీ రోడ్లతో లింక్ అయి ఉంది. ఈ రోడ్లపై నిత్యం వేలాది వెహికిల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. ఓ వైపు వరంగల్-కరీంనగర్ హైవే ఫోర్ లేన్ విస్తరణ పనులతో పాటు వివిధ వెంచర్లకు టిప్పర్లు మట్టిని తరలిస్తున్నాయి. వేసవి కాలం స్టార్ట్ కావడం, ఇండ్ల నిర్మాణ పనులు కూడా స్పీడందుకోవడంతో మట్టి టిప్పర్లు డే అండ్ నైట్ నడుస్తున్నాయి.
ఈ క్రమంలోనే పరిమితికి మించిన లోడ్ తో పాటు హై స్పీడ్ లో వెళ్తున్నారు. హైవేలపై గ్రామాల అప్రోచ్ రోడ్లు ఉన్నా వేగం తగ్గించకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇలా మట్టి టిప్పర్ల ఓవర్ స్పీడ్, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు హనుమకొండ జిల్లా పరిధిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
20 రోజుల్లో ఐదుగురు బలి
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 9 మంది చనిపోగా.. గడిచిన 20 రోజుల్లోనే ఐదుగురు మట్టి టిప్పర్లకు బలయ్యారు. మార్చి 5న ఎల్కతుర్తి మండలకేంద్రంలో టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా.. 6న ఎస్ఆర్ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ ఆకుతోట సుప్రతిక, మహమ్మద్ అక్రమ్ బైక్ పై వస్తుండగా హసన్ పర్తి పెద్ద చెరువు వద్ద మట్టి టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ప్రాణాలు విడిచారు. 11న మడికొండ సమీపంలో టెక్స్ టైల్ పార్క్ వద్ద జడ్సన్ అలియాస్ సుధాకర్ అనే ఓ కూలీ, 23న భీమదేవరపల్లి మండలం మంగళపల్లి వద్ద టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో కదిరి కిరణ్ అనే యువకుడు చనిపోయాడు.
అంతకుముందు ఇదే స్పాట్ లో గొర్రె వెంకటయ్య, సయ్యద్ కరీం, అద్దపు శ్రీనివాస్ టిప్పర్లు ఢీకొని చనిపోగా.. ఆఫీసర్లు కనీసం పట్టించుకోవడం లేదంటూ గత సోమవారం మంగళపల్లి గ్రామస్థులు మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. ఇదిలాఉంటే గత డిసెంబర్ 23న హసన్ పర్తి పీఎస్ పరిధి నిరూప్ నగర్ తండా వద్ద మట్టి టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో దేవన్నపేటకు చెందిన పంజాల చరిత్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఆ తరువాత జనవరి 13న హసన్ పర్తికి చెందిన పెద్దోళ్ల శ్రీనివాస్ అనే కూరగాయల వ్యాపారి టాటా ఏస్ ను ఓ టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఆ మరునాడే 14న హసన్ పర్తి మండలం గంటూరుపల్లి వద్ద కేశవాపూర్ గ్రామానికి చెందిన ఈర కుషుడు అనే పాల వ్యాపారి టిప్పర్ టైర్ల కింద చిద్రమయ్యాడు. జనవరి 26న హంటర్ రోడ్డులో టిప్పర్ ఢీకొని 9 నెలల గర్భంతో ఉన్న ఓ యువ డాక్టర్ మృతి చెందింది. ఫిబ్రవరి 13న శాయంపేట మండలం తహరాపూర్ వద్ద అతి వేగంతో వచ్చిన టిప్పర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు.
లైట్ తీసుకుంటున్న ఆఫీసర్లు
ధర్మసాగర్ మండలంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఎల్కుర్తి, హసన్ పర్తి, హుస్నాబాద్ సమీపంలోని పోతారం నుంచి వరంగల్ సిటీ, చుట్టుపక్కల ఏరియాలకు మట్టి, మొరం రవాణా చేస్తున్నారు. డే అండ్ నైట్ నడుపుతున్న క్రమంలో టిప్పర్ డ్రైవర్లు కనీస రూల్స్ పాటించకపోగా, మితిమీరిన వేగంతో నడుపుతున్నారు. కొన్నిచోట్ల మైనర్లు కూడా టిప్పర్లు, జేసీబీలు నడుపుతున్నారు. ఓ వైపు అతివేగం, అనుభవం లేనితనం, నిర్లక్ష్యం కారణంగా వెహికిల్స్ కంట్రోల్ కాక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి వెహికిల్స్, డ్రైవర్లు రూల్స్ పాటిస్తున్నారో లేదో చెక్ చేయడానికి ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాల్సి ఉంది. ప్రమాదాల నివారణకు పోలీస్ ఆఫీసర్లు కూడా చర్యలు చేపట్టాలి.
కానీ మట్టి టిప్పర్ల కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నా ఆఫీసర్లు కనీసం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోనే మట్టి టిప్పర్ల ఇష్టారాజ్యం నడుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా అధిక లోడ్, మితిమీరిన వేగంతో అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వెహికిల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
