సోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

సోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
  • నాగర్​ కర్నూల్​ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

కొల్లాపూర్, వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను ప్రకృతి సోయగాల కేంద్రంగా మరింత గుర్తింపు తెస్తామని  కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. గురువారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సోమశిల పర్యాటక పనులను స్వయంగా పరిశీలించిన ఆయన, అక్కడ జరుగుతున్న ఎకో టూరిజం ప్రాజెక్టులు, హేలీ టూరిజం, ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నల్లమల కొండలు, కృష్ణమ్మ పరవళ్లు లాంటి సహజ సౌందర్యాన్ని పర్యాటకులు ఆస్వాదించేలా సౌకర్యాలు కల్పించాలని, పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. కృష్ణా నదిపై నిర్మిస్తున్న ఐకానిక్ కేబుల్ వంతెన పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా మెరుగుపడటమే కాకుండా, సోమశిల దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే టూరిజం హబ్‌‌‌‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో బన్సీలాల్, జిల్లా టూరిజం అధికారి నరసింహ పాల్గొన్నారు..

మొక్కజొన్న కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూడాలి.

నాగర్ కర్నూల్ టౌన్ : నాగర్ కర్నూల్ జిల్లాలోని 18 జిన్నింగ్ మిల్లులలో మొక్కజొన్నను కొనుగోలు చేసి నిల్వ ఉంచాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన మొక్కజొన్నను వేగంగా సేకరించాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రతి కేంద్రంలో తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు, రైతులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా టోకెన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రైతులకు చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని పేర్కొన్నారు. 90 రోజుల కార్యాచరణలో భాగంగా మే 2న జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాలను సక్సెస్​ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.