అస్వస్థతకు గురైన పలువురు ట్రిపుల్ ఐటి  విద్యార్థులు

అస్వస్థతకు గురైన పలువురు ట్రిపుల్ ఐటి  విద్యార్థులు

తమ సమస్యలను పరిష్కరించాలంటూ నిరాహార దీక్ష చేసిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల్లో కొందరు అస్వస్థతకు గురయ్యారు. పి1, పి2కి చెందిన ఎక్కువ మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, తలనొప్పి, విరేచనాలతో బాధపడుతున్నారు. తమకు కరోనా తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని కొందరు విద్యార్థులు చెబుతుండడం ఆందోళన కల్గిస్తోంది. పలువురు విద్యార్థులకు కరోనా చికిత్స మందులు ఇస్తున్నట్లు సమాచారం. మరోవైపు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.  ట్రిపుల్ ఐటీ ఆస్పత్రి సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థులకు నార్మల్ టాబ్లెట్స్ ఇచ్చి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు క్లాసులు ప్రారంభంకావడంతో చాలామంది విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారు. E3, E4 విద్యార్థులు సెలవుల అనంతరం క్యాంపస్ కు చేరుకుంటున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు మరోసారి చర్చించుకుని కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు :  స్టూడెంట్స్ తల్లిదండ్రులు
బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. క్యాంపస్ లోని సమస్యలను పరిష్కరించకపోతే స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇచ్చి, దాన్ని మూసివేయాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలకు ఏమైనా జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ఆదివారం స్టూడెంట్ల పేరెంట్స్ ముట్టడించారు. పేరెంట్స్ విడతల వారీగా రాగా, వచ్చినోళ్లను వచ్చినట్టు పోలీసులు అరెస్టు చేశారు.

చివరికి కొందరు ఇంటి వరకూ చేరుకొని ధర్నా చేశారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. సబిత ఇంట్లో లేరంటూ బలవంతంగా వారిని అరెస్ట్ చేసి స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకపోతే బాసరకు వెళ్లి ఆందోళన చేస్తామని, అవసరమైతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. తమను గూండాల్లాగా అరెస్టు చేసిన సర్కార్ కు తగిన బుద్ధి చెప్తామన్నారు.