తాగడానికి డబ్బివ్వలేదని గొడ్డలితో తల్లిపై కొడుకు దాడి

తాగడానికి డబ్బివ్వలేదని గొడ్డలితో తల్లిపై కొడుకు దాడి

తొర్రూరు, వెలుగు: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిపైనే గొడ్డలితో దాడికి దిగాడు ఒక కొడుకు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్​ జిల్లా చెర్లపాలెంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిట్టిమల్ల యాకయ్య(అజీమ్​) తన తల్లి చిట్టిమల్ల లచ్చమ్మను బుధవారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. అప్పటికే అతను మద్యం సేవించి మత్తులో ఉన్నాడు. ఇది గమనించిన ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పింది. దీంతో యాకయ్య తల్లితో గొడవకు దిగాడు. ఆగ్రహంతో గొడ్డలి తీసుకొని తల్లి తల, చేతులపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను చికిత్స నిమత్తం ఎంజీఎంకు తరలించారు. యాకయ్యపై గురువారం కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.